
విజయనగరం రూరల్: భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యది ప్రత్యేకమైన శకమని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరములో మంగళవారం సాయంత్రం ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. విజయనగరం ఇంజనీర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ లో మొదటిసారి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఒక సివిల్ ఇంజనీర్‌గా మోక్షగుండం పుట్టినరోజు కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అత్యంత సాంకేతికత, డిజిటల్ రంగం అందుబాటులోకి వచ్చినప్పటికీ అతి తక్కువ ఖర్చుతో నిర్మాణాల శైలి ఎలా చేపట్టాలనే విషయాలపై నేటి ఇంజనీర్లు సీనియర్ల వద్ద సలహాలు తీసుకోవాలన్నారు. ఇంజనీర్లను ప్రోత్సహించేందుకు జిల్లాలో ఇంజనీర్లు రూపొందించిన ఆలోచన విధానాలను, ప్రాజెక్టులను ప్రజల మధ్యలో ఆవిష్కరించాలని, ప్రతిభ కలిగిన వారిని గుర్తించి అవార్డులు ఇవ్వాలని సూచించారు. జిల్లాల్లో వివిధ విభాగాలలో పని చేసే ఇంజనీర్లకు సర్టిఫికెట్లు జ్ఞాపికలు అందజేయడంతో పాటు రిటైర్డ్ ఇంజనీర్లను మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ బీవీ రమణమూర్తి, పంచాయతీ రాజ్ ఎస్ఈ రామచంద్రరావు(రిటైర్డ్), ఆర్ అండ్ బీ ఏఈ దినేష్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ వీవీ అప్పారావు, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్‌ విజయనగరం రూరల్: జిల్లాలో వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ సేదు మాధవ్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ అధికారులతో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూమి, ఇప్పటివరకు చేపట్టిన భూసేకరణ, భూముల వివరాలు, అవార్డు ప్రక్రియ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ అంశాలపై అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ, భూముల సర్వే, భూముల వివరాల పరిశీలన, రికార్డుల ధ్రువీకరణ తదితర ప్రక్రియలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రజక కుటుంబాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది: సావిత్రి విజయనగరం రూరల్: రజక కుటుంబాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ రజక సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సి. సావిత్రి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి రజక కుటుంబానికీ చేరేలా కృషి చేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆమె మంగళవారం విజయనగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి విజయనగరంలో 51 వేల మంది రజక జనాభా ఉన్నట్లు సావిత్రి తెలిపారు. సొసైటీల ద్వారా బీసీ కార్పొరేషన్‌ నుంచి విడుదలైన నిధులు రజక కుటుంబాలకు అందినట్లు చెప్పారు. ఆమె వెంట ఏపీ రజక సేవా సంఘం అధ్యక్షలు కెల్ల సత్యం, ఉపాధ్యక్షడు తామడ అచ్చన్న ఇతర నేతలు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





