
కదిరి పట్టణం : భార్యాభర్తల మధ్య నేలకొన్న విభేదాలను తొలగించేందుకు జరిగిన పంచాయితీ వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. పంచాయితీకి పిలిచి తన పుట్టింటివారిపై అత్తింటివారు దాడి చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి మండలం ఎగువపల్లికి చెందిన గిరిబాబుకు ఓబుల దేవర చెరువు మండలం తాటి మేకల పల్లికి చెందిన హారికతో మూడేళ్ల కిందట పెళ్లయింది. హారిక ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గిరిబాబు.. పెళ్లయిన కొద్ది నెలల నుంచి వేధింపులకు గురి చేశాడు. అదనపు కట్నంగా డబ్బు, బంగారం తేవాలని, లేదంటే నువ్వు అక్కర్లేదని హారికను వేధించాడు. మంగళవారం కదిరిలో పంచాయితీ చేసుకుందామని గిరిబాబు చెప్పడంతో హారిక.. తన తల్లిదండ్రులు ఆదినారాయణ, సునీత, బావ రమేశ్‌ బాబు కదిరికి వచ్చారు. పెద్ద మనుషులు రెండు కుటుంబాలకు సర్ది చెబుతుండగా గిరిబాబు కర్రతో తన తండ్రి తలపై కొట్టాడని, తనను, కుటుంబ సభ్యులనూ గాయపరిడాని హారిక తెలిపింది. తమ అంతు చూస్తామని అత్తింటివారు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని కదిరి పట్టణ పోలీసులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





