
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Telangana Rythu Bharosa Scheme: తెలంగాణ రైతు భరోసా పథకం రైతులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. అర్హులైన ప్రతి రైతుకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక చేయూత అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఈ నిధులను ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. శిల్పకళా వేదికలో జరిగే రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న అనంతరం సీఎం ప్రసంగించి, రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. మొదటగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు రూ. 2,482 కోట్లు జమ అవుతాయి. ఎకరాకు రూ. 6,000 చొప్పున ఈ నిధులను దశలవారీగా మంజూరు చేస్తారు. మంత్రి తుమ్మల ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం.. రైతు భరోసా పథకం నిధులు మొదటగా రెండు ఎకరాల లోపు భూమి ఉన్న అన్నదాతలకు ఈ డబ్బులు అందుతాయి. కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారు జూలై 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ రైతు భరోసా నిధులను నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. దీనికి సంబంధించి అధికారిక వెబ్సైట్ లో స్టేటస్ చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అక్కడ ఆధార్ నంబర్ ద్వారా ఓటీపీ నమోదు చేసి వివరాలను తెలుసుకోవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోలుకు సాయం అందుతుంది. ఖరీఫ్ , రబీ సీజన్లలో ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ప్రస్తుత దశలో రెండు ఎకరాల లోపు ఉన్న చిన్న రైతులకు ప్రాధాన్యత ఇస్తూ, ఆ తర్వాత మిగిలిన వారికి కూడా నిధులు అందజేస్తారు.
రైతు భరోసా నిధులు పొందాలంటే తెలంగాణలో వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. తెలంగాణ నివాసి అయి ఉండాలి. అలాగే ధరణి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. పోడు భూములకు సంబంధించి అటవీ హక్కుల గుర్తింపు 'టైటిల్స్' ఉన్న గిరిజన రైతులు కూడా దీనికి అర్హులు. బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు జత చేయడం తప్పనిసరి.
అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఈ పథకం వర్తించదు. అలాగే సొంతంగా వ్యవసాయ భూమి లేని వారు, దేవాలయాలు లేదా ఇతర సంస్థల యాజమాన్యంలో ఉన్న భూములు, సాగు చేయని భూములు, కొండలు, రాతి ప్రాంతాలు, రియల్ ఎస్టేట్ కోసం మార్చిన భూములకు ఈ నిధులు అందవు.
రైతు భరోసా అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేసి, కుడివైపు మూలలో ఉన్న 'లాగిన్' పై క్లిక్ చేయాలి. అక్కడ లబ్ధిదారుల పేరు, పాస్వర్డ్ నమోదు చేసి, మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ వెరిఫై చేయాలి. లాగిన్ అయిన తర్వాత 'లబ్ధిదారుల జాబితా' విభాగానికి వెళ్లి మీ ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు. అయితే, మొదట ఆధార్ నంబర్ నమోదు చేసి వివరాలు సబ్మిట్ చేస్తేనే స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
ఇటీవల పాస్ బుక్కులు పొందిన వారు, జూన్ 15లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న యజమానులు ఆఫ్ లైన్ ప్రక్రియ ద్వారా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం జూలై 5వ తేదీలోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఏఈఓ (AEO) ను సంప్రదించవచ్చు. అధికారిక వెబ్సైట్ నుండి రైతు భరోసా ఫారమ్ తీసుకుని, అవసరమైన పత్రాలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ధ్రువీకరణ పూర్తయిన తర్వాతే ఈ పథకానికి అర్హత లభిస్తుంది. జూలై 5 లోపు దరఖాస్తు చేసుకున్న వారు నిబంధనల ప్రకారం అర్హత పొంది, పెట్టుబడి మద్దతును పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.