ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి పని వేళలపై కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ సెంటర్లు ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి.
ఈ కొత్త పనివేళలు జూన్ 29 నుంచి జులై 28 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అంగన్వాడీ టీచర్లు బూత్ లెలవ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న SIR (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియలో వీరు కీలకంగా మారారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల వేళల్లో మార్పులు చేసింది.. నెల రోజుల పాటూ ఈ కొత్త టైమింగ్స్ అమల్లో ఉంటాయి.అంగన్వాడీ టీచర్లుబూత్ లెవల్ ఆఫీసర్లుగా ఉండటంతో SIR ప్రక్రియతో బిజీ అయ్యారు. అందుకే వారికి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అంగన్వాడీలకు సంబంధించిన ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి మారిన టైమింగ్స్‌ను గమనించాలని పిల్లల తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. జులై 28 వరకు ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని సూచిస్తున్నారు. అయితే బీఎల్వోలుగా విధులు నిర్వహించని వారికి మాత్రం ఈ నిబంధనలు వర్తించవు అంటున్నారు. ఆ అంగన్వాడీ కేంద్రాలు మాత్రం యథావిధిగా సాధారణ పనివేళల్లోనే కొనసాగుతాయంటున్నారు.మరోవైపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR)కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. జులై 4, 5 తేదీల్లో ఎన్యూమరేషన్ పత్రాల డిజిలైజేషన్ ప్రక్రియ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఓటర్లు ఈ డ్రైవ్ విషయంలో బీఎల్వోలకు సహకరించాలని కోరారు. ఈసీఐనెట్ యాప్‌లోని ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో’ ఆప్షన్ ద్వారా బీఎల్వోలను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 29 సాయంత్రానికి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ 96.61 శాతం మేర పూర్తయ్యిందన్నారు. మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉంటే.. వారిలో 4,02,15,339 మందికి ఈ పత్రాలు అందజేశామన్నారు. వీటిలో 95,95,180 (23.05 శాతం) పత్రాలు డిజిటలైజ్ చేశామని తెలిపారు.