
టీమిండియా టీ20 సారథిగా శ్రేయస్ అయ్యర్ భవితవ్యం ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం తర్వాత, జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సిరీస్ అతనికి అగ్నిపరీక్షగా...
టీమిండియా టీ20 సారథిగా శ్రేయస్ అయ్యర్ భవితవ్యం ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం తర్వాత, జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సిరీస్ అతనికి అగ్నిపరీక్షగా నిలవనుంది. ఇందులో కనుక భారత్ విఫలమైతే, అయ్యర్ స్థానంలో ఒక యువ స్టార్ ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించేందుకు సెలక్టర్లు సిద్ధమవుతున్నారు.
ఐపీఎల్ హీరో.. అంతర్జాతీయ వేదికపై జీరో అవుతున్నాడా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేదికగా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2024 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపిన అయ్యర్, ఆ మరుసటి ఏడాది 2025లో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు నడిపించాడు. ఈ రెండు సీజన్లలో కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ పరుగుల వరద పారించాడు. అయితే 2026 ఐపీఎల్ సీజన్ ప్రథమార్ధంలో మెరిసినా, ద్వితీయార్ధంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
ఇది కూడా చదవండి: Team India: సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే.. పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు..
అయినప్పటికీ, సెలక్టర్లు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. గత ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించి కూడా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టి, శ్రేయస్ అయ్యర్‌కు టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించారు. కానీ, అయ్యర్ కెప్టెన్సీ ప్రస్థానం అత్యంత నిరాశాజనకంగా ప్రారంభమైంది.
ఐర్లాండ్ చేతిలో ఘోర పరాభవం.. విమర్శల పాలైన అయ్యర్..
భారత జట్టు పగ్గాలు చేపట్టిన తొలి పర్యటనలోనే శ్రేయస్ అయ్యర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్ గురైంది. జూన్ 26న జరిగిన తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా, చరిత్రలోనే మొదటిసారి ఐర్లాండ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత జూన్ 28న జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి సిరీస్‌ను 2-0తో ప్రత్యర్థికి సమర్పించుకుంది.
ఇది కూడా చదవండి: IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!
ఈ సిరీస్‌లో శ్రేయస్ తీసుకున్న కొన్ని మైదాన నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీశాయి. కెప్టెన్సీ పక్కన పెడితే బ్యాటింగ్‌లోనూ నాలుగో స్థానంలో బరిలోకి దిగిన అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 7 బంతుల్లో 3 పరుగులు, రెండో మ్యాచ్‌లో 7 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశాడు. తనను కెప్టెన్‌గా నియమించడంపై విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించే సువర్ణావకాశాన్ని అయ్యర్ చేజేతులా జారవిడుచుకున్నాడు.
ఐర్లాండ్ చేతిలో దెబ్బతిన్న టీమిండియాకు ఇప్పుడు ఇంగ్లాండ్ రూపంలో మరో పెద్ద గండం పొంచి ఉంది. జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల దిగ్గజ ఆటగాళ్లు ఉన్న ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపై ఢీకొట్టడం అయ్యర్‌కు అంత తేలికైన విషయం కాదు. ఈ సిరీస్ గెలవాలంటే అయ్యర్ బ్యాటింగ్‌తో పాటు వ్యూహాత్మకంగానూ రాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో కూడా భారత్ ఓడిపోతే, అయ్యర్ కెప్టెన్సీ ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!
శ్రేయస్ అయ్యర్ కనుక ఇంగ్లాండ్ సిరీస్‌లో విఫలమైతే, సెలక్టర్ల తదుపరి ఛాయిస్‌గా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ పేరు బలంగా వినిపిస్తోంది. గత ఏడాది ఫామ్ లేమి కారణంగా టీ20 జట్టుకు దూరమైన గిల్, 2026 ఐపీఎల్లో ఏకంగా 700కు పైగా పరుగులు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ పొట్టి ఫార్మాట్లో రాణించే సత్తా తనకుందని చాటిచెప్పిన గిల్‌ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చి టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.