అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంలో నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
ఈ మేరకు పోలీసులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయోధ్య నయాఘాట్ ప్రధాన శాఖలో దాదాపు నాలుగు గంటల పాటు విచారణ నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన ఎనిమిది మందిలో ఏడుగురి బ్యాంక్ ఖాతాలు ఈ శాఖలోనే ఉండటం విశేషం.శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన ఖాతా కూడా ఇదే శాఖలో ఉంది. ఎనిమిదో నిందితుడి ఖాతా ఫైజాబాద్ ఎస్బీఐలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్బీఐ మేనేజర్ అనూప్ త్రిపాఠి మాట్లాడుతూ రామాలయ విరాళాల కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల బ్యాంక్ ఖాతాల వివరాలను పోలీసులు కోరారని, వారికి అవసరమైన మేర సమాచారాన్ని అందించినట్లు తెలిపారు.మూడు నెలల కిందటే రామాలయ విరాళాల లెక్కల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందని, ఎస్బీఐ ట్రస్ట్‌తో పాటు అయోధ్య పోలీసులకు ఎవరో సమాచారం ఇచ్చారని.. అయితే ఆ హెచ్చరికను పట్టించుకోలేదని ఎస్బీఐకు చెందిన ఓ అధికారి వెల్లడించడం గమనార్హం. కొందరు ట్రస్ట్ అధికారులు హెచ్చరికలు వస్తున్నప్పటికీ అదే సిబ్బందితో నగదు లెక్కింపు చేయించారని తెలిపారు.విరాళాల నగదు లెక్కింపు బాధ్యతను ట్రస్ట్ ఎస్బీఐకి అప్పగించినప్పటికీ, కొందరు ట్రస్ట్ అధికారులు తమకు అనుకూలమైన వ్యక్తులను లెక్కింపు బృందంలో చేర్చాలని బ్యాంక్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు మరో సీనియర్ బ్యాంక్ అధికారి వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు నగదు లెక్కింపు విధానంలో కూడా అనేక లోపాలను గుర్తించినట్లు సమాచారం. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం అధికారులను కూడా నియమించలేదని దర్యాప్తులో తేలింది.జూన్ 26న పోలీసులు నగదు లెక్కింపు బృందానికి చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిలో అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, రామ్‌శంకర్ యాదవ్, మనీష్ యాదవ్, సుభాష్ శ్రీవాస్తవ, అవినాశ్ శుక్లా, రామశంకర్ మిశ్రా, కరుణేష్ పాండే ఉన్నారు. వీరిలో ఏడుగురు ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు రూ. 79.85 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.