
దేవరకద్ర, న్యూస్‌టుడే: కడదాకా కలిసి ఉండాల్సిన భార్య.. కనికరం లేకుండా భర్త చేతులను చీరతో కట్టేసి.. కత్తితో అతికిరాతకంగా నరికి చంపిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఎస్సై భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. దేవరకద్ర మండలం బస్వాయపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరు నాగేశ్(38)కు, కోయిలకొండ మండలం మల్కాపూర్‌కు చెందిన కవితతో 17 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. కుటుంబమంతా సంతోషంగా ఉన్న సమయంలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అయినా ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో తాగొచ్చి ఆమెతో గొడవకు దిగేవారు. ఆదివారం రాత్రి కుమారులు నిద్రిస్తున్న సమయంలో.. కవిత చీరతో నాగేశ్ చేతులు కట్టేసి కత్తితో నరుకుతుండగా చిన్న కుమారుడు గమనించి కేకలు వేశాడు. శబ్దం విన్న చుట్టుపక్కల వారు ఇంటి తలుపు లు విరగొట్టి తెరిచారు. రక్తపు మడుగులో ఉన్న నాగేశ్‌ను జిల్లా ఆస్పత్రికి.. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతిచెందారు. మృతుడి సోదరుడు రాజప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.