
గత కొన్నేళ్లలో భారతీయ సినీ పరిశ్రమలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే అభిప్రాయం ఉండేది.
కానీ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండియన్ సినిమాకు కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా పాన్ ఇండియా కాన్సెప్ట్‌ను సక్సెస్ఫుల్ గా నిలబెట్టిన సౌత్ డైరెక్టర్లు, హీరోలు దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నారు.
ఈ మార్పుకు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన బాహుబలి(Bahubali) సిరీస్ బలమైన పునాది వేసింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్(RRR), పుష్ప(Pushpa), కేజీఎఫ్(KGF) లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసి దక్షిణాది సినిమాల మార్కెట్‌ను మరింత విస్తరించాయి. హిందీ ఆడియన్స్ ను కూడా కొత్త తరహా కథలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ ఎలివేషన్స్‌తో ఆకట్టుకుంటూ ఈ సినిమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.
అయితే ఇటీవల కొన్ని హిందీ మీడియా సంస్థలు పుష్ప, కేజీఎఫ్ వంటి సౌత్ ఫ్రాంచైజీలను బాలీవుడ్ సినిమాలుగా పేర్కొనడం సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమాలు దక్షిణాది సినీ పరిశ్రమ సృజనాత్మకతకు ప్రతీకలు కాగా, వాటిని బాలీవుడ్ అకౌంట్ లో వేయడం సరైన విధానం కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ సినిమాకు కొత్త దిశను చూపిన ఘనత సౌత్ సినీ ఇండస్ట్రీకే దక్కుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.