
ప్రపంచ క్రికెట్లో అటు సంపాదనలోనైనా.. ఇటు ఆటలోనైనా టీమ్ఇండియాకు తిరుగులేదనేది కాదనలేని వాస్తవం. కానీ, ఈ ఆదివారం భారత క్రికెట్ చరిత్రలో మాయని మచ్చగా మారిపోయింది.
ఇటు పురుషుల క్రికెట్‌తోపాటు మహిళల విభాగంలోనూ ఘోర పరాభవం ఎదురైంది. అంతా సండేను జోష్ డే అంటారు.. కానీ మనకు మాత్రం ‘బ్లాక్ డే’ అయిందంటూ క్రీడాభిమానులు విమర్శిస్తున్నారు.
ఐర్లాండ్ అంటే మన దృష్టిలో పసికూనే. సీనియర్లు గాయాల కారణంగా దూరం కావడంతో మన కుర్రాళ్లు దంచేస్తారులే అని అంతా భావించారు. తీరా, తొలి మ్యాచ్‌లోనే టీమ్ఇండియాకు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. సర్లే.. అక్కడి పిచ్, వాతావరణానికి మనోళ్లు కాస్త అలవాటు పడేందుకు సమయం కావాలి కదా.. అని భావించారు.
అసలైన పరీక్ష రెండో టీ20లో ఎదురైంది. 150+ పరుగుల లక్ష్యాన్ని సాధించడంలోనూ టీమ్ఇండియా విఫలం కావడం తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. మొదటి టీ20లో 180+ ఉంది కదా.. పిచ్ కూడా మన దగ్గర ఉన్నట్లు లేదుగా ఓడిపోయారని సర్దిచెప్పుకొన్నాం. తీరా, రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయాం. తిలక్ వర్మతోపాటు ఆఖర్లో హర్షిత్ రాణా దూకుడుగా ఆడాడు కాబట్టి.. ఘోర ఓటమి నుంచి బయటపడ్డాం. టాప్ ఆర్డర్ పెవిలియన్‌కు చేరగానే మన పరాజయం ముందే డిసైడ్ అయిపోయింది. భారత మూలాలు కలిగిన ఐర్లాండ్ పేసర్ మూండ్రాకు వికెట్లు సమర్పించడం గమనార్హం.
పైన పురుషుల టీమ్ కోల్పోయింది సిరీస్ మాత్రమే. అయితే, ఐర్లాండ్ చేతిలో కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక మహిళల జట్టు ఆదివారం టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో తలపడి ఓడి సెమీస్‌కు చేరే అవకాశాన్ని చేజేతులా మిస్ చేసుకుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన టీమ్ఇండియా గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించడం అభిమానులకు రుచించడం లేదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌పై గెలిచి.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో భారత్ మూడో స్థానానికి పడిపోయింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.