ముక్కులో వేయాల్సిన మందు కళ్లల్లో వేయడంతో 19 నెలల చిన్నారి శాశ్వతంగా చూపు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
సాగర్ జిల్లా బండా సివిల్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన చిన్నారికి వైద్యుడు పొరపాటున ముక్కులో వేయాల్సిన సెలైన్ నాసల్ డ్రాప్స్‌ను కళ్లల్లో వేయడంతో చూపు పోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మే 29న ఇంద్రాజ్ విశ్వకర్మ తన 19 నెలల కుమారుడు వినయ్ విశ్వకర్మను బండా సివిల్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. జలుబు చేసి కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు ఉండటంతో ప్రభుత్వ వైద్యుడికి చూయించాడు. ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యుడు చికిత్సలో భాగంగా సెలైన్ నాసల్ డ్రాప్స్‌ను కళ్లలో వేశాడు. దాంతో పాటు పారాసిటమాల్ సిరప్, ఇంజెక్షన్‌తో పాటు మరికొన్ని మందులు కూడా రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Read Also అనంతరం కొన్ని గంటల్లోనే చిన్నారి ఆరోగ్యం మరింత దిగజారిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలోని వైద్యులు చాలాసేపు పరీక్షించిన తర్వాత కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో వైద్యులు చిన్నారిని సాగర్ జిల్లా ఆస్పత్రికి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం భోపాల్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. Read Also ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం చిన్నారికి చూపు శాశ్వతంగా పోయిందని, బండా సివిల్ ఆస్త్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇంద్రాజ్ విశ్వకర్మ బండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బాధ్యులైన వైద్యుడు, ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. దీనిపై మెడికల్ ఆఫీసర్ యోగేంద్ర ఖతిక్ మాట్లాడుతూ జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోందన్నారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారి శాశ్వతంగా చూపుకోల్పోవడంతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.