పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కేతన్ హత్యకు ముందు పెళ్లి షాపింగ్ పేరుతో కాబోయే భార్య, నింది
తురాలు సియా అగర్వాల్ అతడి దగ్గర నుంచి రూ.కోటి తీసుకున్నట్టు తాజాగా పోలీసులు తెలిపారు. సియా గోయల్ , ప్రియుడు చేతన్ చౌదరి కలిసి హత్యను ముందుగానే ప్లాన్ చేయడమే కాకుండా.. అనుమానం రాకుండా నేరం జరిగిన మూడేళ్ల తర్వాత వివాహం చేసుకోవడం సహా వారి భవిష్యత్తు కోసం టైమ్‌లైన్‌ను కూడా సిద్దం చేసుకున్నారని పోలీసులు, వర్గాలు తెలిపాయి. జూన్ 18న పుణేలోని లోహగఢ్ కోట వద్ద అగర్వాల్‌ను కొండపై నుంచి లోయలోకి తోసి చంపారనే ఆరోపణలపై గోయల్, చౌదరిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ‘‘తమ ప్లాన్‌లో భాగంగా కాబోయే భర్త నుంచి పెళ్లి షాపింగ్ కోసమని సియా అగర్వాల్ రూ.కోటి తీసుకుంది.. ఆ డబ్బును తన ప్రియుడు చేతన్ చౌదరికి ఇచ్చింది’’ అని వర్గాలు పేర్కొన్నాయి. ‘‘కేతన్ అగర్వాల్ పెళ్లి ఏర్పాట్ల కోసం గోయల్‌కు ఆ డబ్బు ఇచ్చారు.. వాటిని ఆ పనులకు ఉపయోగించకుండా ప్రియుడు కెరీర్, వ్యాపారాన్ని సుస్థిరం చేసుకోడానికి సహాయపడతానని చెప్పి ఆ మొత్తం అతడికి ఇచ్చేసింది.. ఆర్థికంగా బలహీనమైన కుటుంబం నుంచి వచ్చిన చౌదరి.. తాను ఆర్థికంగా స్థిరపడటానికి కనీసం మూడేళ్లు పడుతుందని ఆమెతో చెప్పాడు’’ అని వెల్లడించాయి.హత్య తర్వాత అనుమానం రాకుండా ఉండేందుకు మూడేళ్లపాటు పెళ్లి చేసుకోకుండా ఉండాలని వారిద్దరూ అంగీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చౌదరి ఆర్థికంగా స్థిరపడి, కేసు మరుగున పడిన తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. విచారణ నుంచి తప్పించుకుని, చివరికి గోయల్ కుటుంబం ఆమోదం పొందడానికే ఈ కాలపరిమితిని ఒక వ్యూహంలో భాగంగా నిర్ణయించుకున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా లోహగఢ్ కోట పైనుంచి అగర్వాల్‌ను తోసేయమని చౌదరికి సంకేతం ఇవ్వడమే కాకుండా, కింద పడుతున్నప్పుడు బాధితుడికి అందకుండా ఉండేందుకు దూరంగా కూర్చుందని పోలీసులు తెలిపారు. ప్రణాళిక ప్రకారం.. గోయల్ కూర్చోవడం ద్వారా సంకేతం ఇవ్వాలి, ఆ తర్వాత చౌదరి ముందుకు వచ్చి అగర్వాల్‌ను తోసి చంపేయాలి అని ఒక అధికారి తెలిపారు. ఆమె నీళ్లు తాగడం లేదా షూలేసులు కట్టుకును నెపంతో కూర్చోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. కూర్చోవడమే సంకేతమని ఆ అధికారి తెలిపారు. అయితే, ఇది ఆమెను రక్షించడానికి కూడా బాగా ఆలోచించి వేసిన ఎత్తుగడ.‘‘కేతన్‌ను తోసేసినప్పుడు గోయల్ బాధితుడికి అందకుండా ఉండేందుకు ఆ సంకేతాన్ని ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నారు... ఒకవేళ చేతన్, కేతన్‌ను తోసివేసి, అతడు కింద పడుతున్నప్పుడు సియాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, ఆమె కూడా లోయలో పడిపోవచ్చని వారు భయపడ్డారు. ఆమె భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను రూపొందించారు’’ అని ఆ అధికారి చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.జూన్ 18న గోయల్, అగర్వాల్‌లను ఫాలో అయినప్పుడు చౌదరి తన ఉనికిని దాచడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగానే పుణే నుంచి లోహగఢ్ కోటకు సుమారు 90 కిలోమీటర్ల దూరాన్ని కారుకు బదులుగా స్కూటర్‌పై ప్రయాణించాడని పోలీసులు తెలిపారు. ‘‘చౌదరి జూన్ 18 ఉదయం లోహగడ్ కోటకు బయలుదేరాడు.. టోల్ ప్లాజా వద్ద కారును గుర్తిస్తారనే భయంతో దానికి బదులుగా స్కూటర్‌ను ఎంచుకున్నాడు. మేము స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు. అంతేకాదు, కోటపై నుంచి కేతన్‌ను తోసేయడానికి అరగంట ముందు ఇరువురి మధ్య సీక్రెట్ కాల్ మాట్లాడుకున్నట్టు విచారణలో వెల్లడయ్యింది.