Hyderabad Housing Sales Down: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు షాకింగ్ న్యూస్. కొన్నేళ్లుగా దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా నెమ్మదించింది.
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. ఏకంగా 2023 జనవరి నాటి కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. ఈ మేరకు తాజా రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఇళ్ల కొనుగోలు దారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ డేటా ప్రకారం 2026 క్యూ2లో (ఏప్రిల్- జూన్) 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 90,715 యూనిట్లుగా నమోదయ్యాయి. 2025 క్యూ2లో 96,285 ఇళ్ల విక్రయం జరగ్గా.. ఇప్పుడు అది 6 శాతం తగ్గి 90715 యూనిట్లకు పడిపోయింది. ఇక క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే అంటే ఈ ఏడాది జనవరి- మార్చి సమయంతో పోలిస్తే విక్రయాలు 11 శాతం తగ్గాయి. టాప్- 7 సిటీల్లో హౌసింగ్ సేల్స్ వాటాలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు కలిపి 48 శాతానికిపైగా ఉండగా.. ఈ 2 నగరాల్లోనే 43,995 యూనిట్లు అమ్ముడుబోయాయి. మిగతా నగరాల్లో కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరుల్లో చూస్తే వరుసగా 10 శాతం, 2 శాతం, ఒక శాతం చొప్పునే పెరిగాయి. అంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి చెందడం ఆశ్చర్యం కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పుణెలో చూస్తే సేల్స్ ఏకంగా 15 శాతం తగ్గాయి. ఇళ్ల అమ్మకాలు తగ్గేందుకు ప్రధాన కారణాలు ఇవే.. మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల ఐటీ ఉద్యోగాలపై ప్రభావం పడుతుందేమోనని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇళ్లు కొనేందుకు వెనుకాడుతున్నారు. ఇతర రంగాల ఉద్యోగాలపైనా యుద్ధం ప్రభావం చూయిస్తోంది. మరోవైపు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు పెరుగుతుండటం వల్ల సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం వల్ల హోం లోన్ వడ్డీ రేట్లు కూడా తగ్గకుండా స్థిరంగా ఉండటం లేదా పెరగడం కూడా ఈఎంఐల్ని పెంచుతుంది.