కాలేయం పనితీరు సరిగా లేకపోతే శరీరంలో విష పదార్థాలు పేరుకుపోయి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ముఖంపై కనిపించే కొన్ని సంకేతాల ద్వారా మీ కాలేయం సరిగా పనిచేయట్లేదని తెలుసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ఎలాంటి లక్షణాలు మీ కాలేయం డ్యామేజ్‌ను నిర్ధారిస్తాయో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. రమాకాంత్ రెడ్డి ఎ (గ్లేనిగల్స్ అవేర్ హాస్పిటల్స్, ఎల్బి నగర్, హైదరాబాద్) మాటల్లో తెలుసుకుందాం.
కాలేయం పనితీరు దెబ్బతింటే కనిపించే ప్రధాన లక్షణం కామెర్లు. దీనివల్ల చర్మం, కాళ్లు పసుపు రంగులోకి మారతాయి. ఇలాంటి లక్షణం కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
కాలేయం పనితీరు సరిగా పనిచేయకపోతే ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో నీళ్లు నిల్వ ఉండి కళ్ల కింద ప్రాంతం, బుగ్గలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. దీంతో ముఖం కూడా ఉబ్బినట్లు అనిపిస్తుంది.
కాలేయం పనితీరు తగ్గితే ఇన్సులిన్ నిరోధకత నియంత్రణలో ఉండదు. దీంతో మెడ, ముఖం ప్రాంతంలో నల్లటి ప్యాచెస్ కనిపిస్తాయి. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యకు సంకేతంగా భావిస్తారు.
కాలేయం డ్యామేజ్ కావడం వల్ల పోషకాల శోషణ తగ్గిపోతుంది. దీంతో విష పదార్థాలు రక్తంలో పేరుకుపోయి చర్మం డల్‌గా కనిపిస్తుంది. అలాగే ఎప్పుడు కూడా నీరసంగా ఉన్నట్లుగా కనిపిస్తారు.
కాలేయం దెబ్బతినడం వల్ల మెడ దగ్గర నరాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అలాగే వీన్స్ స్పైడర్ లాగా కనిపిస్తాయి. ఇది కూడా కాలేయం పనితీరు మందగించిందనడానికి సంకేతమే.
కాలేయం సరిగా పనిచేయకపోతే రక్తంలో బైల్ రసం పేరుకుపోతుంది. దీంతో చర్మంపై దురద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై కూడా దురద ఉంటుంది.
కాలేయం పనితీరు తగ్గిపోతే పోషకాల శోషణ కూడా తగ్గుతుంది. దీంతో ముఖంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా నోరు చుట్టూ ఈ మచ్చలు ఎక్కువగా ఉంటాయి.
విశ్రాంతి సరిపడా తీసుకున్నా, నిద్ర పోయినా కూడా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడితే జాగ్రత్త పడాలి. ఎందుకంటే కాలేయం పనితీరు మందగించి బాడీ డీటాక్స్ తగ్గిపోతుంది. దీంతో కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.