HYDRAA Hyderabad Nala Cleanup : భాగ్యనగరంలోని చెత్తంతా.. వీధులు, డస్ట్బిన్లలో కాకుండా మురుగు, వరద కాలువల్లోనే ఉందనే దారుణ పరిస్థితి కనిపిస్తోంది.
ఏ నాలాను కదిలించినా లారీల కొద్దీ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో వర్షం పడినప్పుడు కాలనీలు, రహదారులు జలమయం కాకుండా చూసేందుకు 'హైడ్రా' నడుం బిగించింది. వర్షాలు లేని సమయంలో వరదలకు గల మూల కారణాలపై దృష్టి సారించి, నాలాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్), మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (ఎంఈటీ) సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. నాలాల్లో పిడ ఉన్న సోఫాలు, పరుపులు, కేబుల్ వైర్లు వాటన్నింటినీ చాలా కష్టపడి తొలగిస్తున్నారు. ఆఘాపురాలోనే 13 టిప్పర్ల వ్యర్థాలు..!ప్రజలు తాము వాడి పారేసిన పరుపులు, దిండ్లు, దుప్పట్లు, సోఫాలు, కుర్చీలు, కేబుల్ వైర్ల నుంచి ప్లాస్టిక్ కవర్ల వరకు అన్నింటినీ నాలాల్లోనే పారేస్తుండటంతో.. వరద నీరు వెళ్లే బాక్స్ డ్రైన్లు పూర్తిగా పూడిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), సైబరాబాద్ (సీఎమ్సీ), మల్కాజిగిరి (ఎమ్ఎమ్సీ) కార్పొరేషన్లతో పాటు ఇరిగేషన్, పోలీస్ శాఖల సమన్వయంతో హైడ్రా ఈ డ్రైవ్ చేపట్టింది. మెహిదీపట్నం, మల్లేపల్లి, విజయనగర్ కాలనీ మీదుగా మూసీలో కలిసే 'ఆఘాపురా నాలా' పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. దారూసలాం కల్వర్టు వద్ద స్థానికులు ఇచ్చిన సమాచారంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సిబ్బంది రంగంలోకి దిగారు. అక్కడ జేసీబీ వెళ్లేందుకు వీలుగా కాలువ ప్రహరీని తొలగించి, గత 6 రోజులుగా శ్రమించి ఆదివారం నాటికి ఏకంగా 13 టిప్పర్ల చెత్తను తొలగించారు. మరో రెండు రోజుల్లో ఈ నాలా పూర్తిగా క్లియర్ కానుంది.మియాపూర్, చందానగర్‌లలో వైర్ల, ప్లాస్టిక్ కుప్పలు..!నగరంలోని మరికొన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. మియాపూర్ నుంచి పటాన్చెరు వెళ్లే మార్గంలోని బాక్స్ డ్రైన్లో కేబుల్ వైర్లన్నీ ఒక తెట్టులా పేరుకుపోయి నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకున్నాయి. జేసీబీల సహాయంతో వాటిని బయటకు లాగాల్సి వచ్చింది. అలాగే కేవలం 5 సెంటీ మీటర్ల వర్షం పడినా చందానగర్, లింగంపల్లి ఆర్యూబీ (ఆర్యూబీ) రహదారి చెరువును తలపిస్తుంది. కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఎస్ఎన్డీపీ బాక్స్ డ్రైన్ ఉన్నప్పటికీ.. భూమి సమాంతరంగా ఉండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఒకేచోట పేరుకుపోయాయి. హైడ్రా సిబ్బంది అక్కడి ఇనుప గ్రిల్స్ తొలగించి రెండు ట్రక్కుల ప్లాస్టిక్ వ్యర్థాలను క్లియర్ చేశారు.కృష్ణానగర్ ముంపునకు చెక్..!జూబ్లీహిల్స్ నుంచి వచ్చే భారీ వరద నీరు ప్రతీసారి కృష్ణానగర్‌ను ముంచెత్తడానికి ప్రధాన కారణం ఒక కిలోమీటరు పొడవున్న బాక్స్ డ్రైన్‌పై స్లాబ్ వేయడమే. పూడిక తీయడానికి వీళ్లేకుండా పోవడంతో 10 అడుగుల కాలువలో 7 అడుగుల మేర చెత్త నిండిపోయింది. దీనిని గమనించిన హైడ్రా.. జీహెచ్ఎంసీతో కలిసి అవసరమైన చోట స్లాబులను తొలగించి భారీ ఎత్తున పూడికను విజయవంతంగా క్లియర్ చేసింది. నాలాల్లో చెత్త వేయకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, లేదంటే ఈ వరద ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.