
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పొట్తెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
విజయవాడ, జూన్ 28: ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పొట్తెత్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతోపాటు ఈ రోజు ఆదివారం కూడా కావడంతో.. భారీగా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు. ఉదయం 7.00 గంటల నుంచి భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ లైన్లు అన్ని భక్తులతో కిక్కిరిసి పోయాయి.
దాంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఉదయం 10.30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆలయ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆలయానికి వెళ్లే మార్గాలు, ప్రసాదం విక్రయించే ప్రదేశం, అన్నప్రసాద కేంద్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి.