
పాకిస్థాన్లోని అతిపెద్ద నగరమైన కరాచీలో శనివారం భీకర ఉగ్రదాడి జరిగింది. నగరంలోని సింధ్ రేంజర్ల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి, కాల్పుల ఘటనలో నలుగురు సైనికులు...
పాకిస్థాన్లోని అతిపెద్ద నగరమైన కరాచీలో శనివారం భీకర ఉగ్రదాడి జరిగింది. నగరంలోని సింధ్ రేంజర్ల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి, కాల్పుల ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమవగా, మరొకరిని సజీవంగా పట్టుకున్నారు.కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయంపైకి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దూసుకొచ్చారు. స్థావరాన్ని ఢీకొట్టి వాహనాన్ని పేల్చివేసిన వెంటనే, మిగిలిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే ఎదురుదాడికి దిగడంతో ఆ ప్రాంతం మొత్తం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు, కమాండోలను రంగంలోకి దించారు.ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) నుంచి విడిపోయిన ‘జమాత్-ఉల్-అహ్రార్’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాకిస్థాన్లో భద్రతా బలగాలపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ దాడిపై సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా తీవ్రంగా స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనలో సామాన్య పౌరులెవరూ గాయపడలేదని అధికారులు ప్రాథమికంగా తెలిపారు.