ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలలో ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించేలా ఎక్సైజ్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని విమానాశ్రయాల్లో 24 గంటల పాటు నిరంతరాయంగా తెరిచి ఉంచే బార్లు, వైన్‌షాపుల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన విధానానికి సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలతో కూడిన నోటిఫికేషన్‌ను సోమవారం లేదా మంగళవారాల్లో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు.ఈ సరికొత్త ఎయిర్పోర్ట్ లిక్కర్ పాలసీలో భాగంగా లైసెన్స్ ఫీజులు, దరఖాస్తు రుసుములను ప్రభుత్వం విడివిడిగా ఖరారు చేసింది. విమానాశ్రయాల్లో బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే వారు నాన్ రిఫండ్బుల్ దరఖాస్తు రుసుము కింద రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా వైన్‌షాపుల ఏర్పాటుకు ఈ దరఖాస్తు రుసుమును రూ.2 లక్షలుగా నిర్ణయించారు. విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మద్యం దుకాణాలు 24 గంటల పాటు సేవలు అందించేలా నిబంధనలు రూపొందించారు.ఇక వార్షిక లైసెన్సు రుసుము విషయానికి వస్తే విమానాశ్రయాల్లోని ప్రయాణికుల రద్దీని బట్టి బార్ల ఫీజులను వర్గీకరించారు. ఏడాదికి 20 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికుల రద్దీ ఉండే విమానాశ్రయాలలోని బార్లకు వార్షిక లైసెన్సు రుసుమును రూ.25 లక్షలుగా నిర్ణయించారు. అదే సమయంలో 20 లక్షల కంటే తక్కువ ప్రయాణికుల రద్దీ ఉండే చిన్న విమానాశ్రయాలలోని బార్లకు ఈ రుసుమును ఏడాదికి రూ.15 లక్షలుగా ఖరారు చేశారు.మరోవైపు విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసే వైన్‌షాపుల విషయంలో రద్దీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఒకే విధమైన పన్నును విధించింది. ఏ విమానాశ్రయంలో వైన్‌షాపు ఏర్పాటు చేయాలన్నా వార్షిక లైసెన్సు రుసుమును ఏకంగా రూ.కోటిగా నిర్ణయించారు. తిరుపతి క్షేత్ర పవిత్రతను దృష్టిలో ఉంచుకుని అక్కడి ఎయిర్‌పోర్టుకు మాత్రం ఈ పాలసీ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ సరికొత్త నిర్ణయం ద్వారా విమానాశ్రయాల్లో రాత్రి వేళల్లో ప్రయాణించే దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు మద్యం అందుబాటులో ఉండటంతో పాటు ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరనుంది.