
బీటెక్ చివరి సంవత్సరం పూర్తి చేసి.. ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న విద్యార్థిని కలలు తండ్రి మరణంతో తలకిందులయ్యాయి.
ఫీజు కట్టకపోవడంతో పరీక్షలకు అనుమతించేది లేదని కళాశాల యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతుండగానే ఇద్దరు న్యాయవాదులు తమ ఔదార్యంతో విద్యార్థిని సమస్యకు పరిష్కారం చూపారు. వివరాల్లోకి వెళ్తే.. ఫీజు చెల్లించకపోవడంతో పరీక్షలకు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. విద్యార్థిని తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఐదు సెమిస్టర్ల ఫీజును రెగ్యులర్గా చెల్లించారని, గత ఏడాది మేలో తండ్రి చనిపోవడంతో ఫీజు చెల్లించకపోయారన్నారు. విద్యార్థిని కూడా కోర్టు ఎదుట హాజరై సుమారు రూ.60 వేల ఫీజు బకాయి ఉందని, రూ.20 వేల వరకు తాను చెల్లించగలనని, పరీక్షలకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ సమయంలో అక్కడే ఉన్న సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, ఎస్.శ్రీరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫీజు బకాయి మొత్తం తాము చెల్లిస్తామని చెప్పారు. వారి ఉదారతను న్యాయమూర్తి అభినందించి.. పరీక్ష ఫీజును స్వీకరించి విద్యార్థినిని పరీక్షలకు అనుమతించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజీలకు ఆదేశాలు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.