
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు ఆరు మ్యాచులు జరిగాయి. స్టార్ ప్లేయర్లు లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో బరిలోకి దిగారు.
ఈ క్రమంలో మెస్సి ప్రపంచ రికార్డు నమోదు చేయగా.. రొనాల్డో తన జట్టు తరఫున గోల్ చేయడంలో విఫలం కావడం గమనార్హం. ఇప్పటికే రౌండ్ 32లో పోటీ పడే జట్లేవో తేలిపోయాయి.
లియోనెల్ మెస్సి మాయ ఎలా ఉందంటే.. అతడు బరిలోకి దిగితే అర్జెంటీనాకు గోల్ వచ్చినట్లే. ప్రపంచ కప్ 2026లో తాను ఆడిన మొదటి పోరులోనే మెస్సి హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జోర్డాన్‌పై గోల్ కొట్టి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ కప్ పోటీల్లో వరుసగా ఏడు మ్యాచుల్లోనూ గోల్ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే నాకౌట్‌కు చేరుకున్న అర్జెంటీనా 3-1 తేడాతో జోర్డాన్‌ను ఓడించి హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. గ్రూప్ J నుంచి తలపడిన అల్జీరియా - ఆస్ట్రియా మ్యాచ్ 3-3తో డ్రాగా నిలిచింది. అర్జెంటీనాతోపాటు ఈ రెండు జట్లూ నాకౌట్‌కు చేరుకున్నాయి.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో క్రిస్టియానో రొనాల్డో ప్రదర్శన ఆశించినంత మేర లేదు. తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ఒక్క గోల్ చేయని అతడు.. మళ్లీ ఇప్పుడు కొలంబియాపైనా గోల్ కొట్టడంలో విఫలమయ్యాడు. కొలంబియాతో జరిగిన పోరును పోర్చుగల్ 0-0తో డ్రా చేసుకుంది. దీంతో గ్రూప్ K నుంచి కొలంబియా అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరుకోగా.. పోర్చుగల్ రెండో ప్లేస్‌తో రౌండ్ 32కి అర్హత సాధించింది. పోర్చుగల్ మూడు మ్యాచుల్లో ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి.. రెండింటిని డ్రా చేసుకుంది.
ఫిఫా ప్రపంచ కప్‌లో క్రొయేషియా, ఇంగ్లాండ్, డీఆర్ కాంగో తమ చివరి లీగ్ మ్యాచుల్లో విజయాలను సాధించాయి. ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. ఇక చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో క్రొయేషియా 2-1 తేడాతో ఘనాను మట్టికరిపించింది. డీఆర్ కాంగో చేతిలో 3-1తేడాతో ఓడిన ఉజ్బెకిస్థాన్ ఇంటిముఖం పట్టింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.