
రాష్ట్ర రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి వ్యవహరిస్తోందని, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దాడులకు తెగబడుతోందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో...
రాష్ట్ర రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి వ్యవహరిస్తోందని, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దాడులకు తెగబడుతోందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉందని, రైతులపైకి దండయాత్రలా వెళ్లి రాళ్ల దాడికి దిగడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. జగన్ మోహన్ రెడ్డి పాలన విధ్వంసంతోనే మొదలైందని, ప్రజావేదిక కూల్చివేత నుంచి నేటి రాళ్ల దాడి వరకు వైసీపీ దుష్ట ఆలోచనలు బయటపడుతూనే ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో గతంలో రైతులను నట్టేట ముంచారని, ఇప్పుడు ప్రజలు తిరస్కరించినా "మావిగన్" వంటి విచిత్రమైన పేర్లతో హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం కావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని మనోహర్ పేర్కొన్నారు. భవన నిర్మాణాలు, రహదారుల పనులు చురుగ్గా సాగుతుండటాన్ని చూసి ఓర్వలేక, రాజధానిలో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వైసీపీ అనాలోచిత చర్యలను ప్రజలు తప్పకుండా తిప్పికొడతారని ఆయన హెచ్చరించారు.