
రోడ్డుపై వెళ్తున్న ఓ చిన్నారిని మినీ వ్యాన్ చిదిమేసింది. చిన్నారి రోడ్డు దాటుతుండగా అదే సమయంలో మినీ వ్యాన్ లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా ముందు టైర్లు చిన్నారి మీదకు వెళ్లాయి.
దాంతో చిన్నారి కింద పడిపోయింది. అయితే మినీ వ్యాన్ డ్రైవర్ అలాగే నిర్లక్ష్యంగా వ్యానును ముందుకు నడిపాడు. దాంతో టైర్ల కింద నలిగిపోయి చిన్నారి మృతి చెందింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో పరిధిలోని బోలక్ పూర్ లో ఈ విషాద ఘటన జరిగింది. సరదాగా ఆడుకుంటూ రోడ్డు దాటుతున్న శ్రీహన్స్(4) అనే బాలుడ్ని మినీ వ్యాన్ చిదిమేసింది. ఈ ఘటనతో మినీ వ్యాన్ డైవర్ పరిగెత్తే క్రమంలో ఓ వ్యక్తి అతనిపై దాడి చేసి.. వెంబడించాడు. ఎట్టకేలకు డ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేసిన కాలనీవాసులు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఇక బాలుడి మృతిని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా తల్లిదండ్రులు విలపిస్తున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక మరో ఘటనలో స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వడపర్తిలో ఈ విషాద ఘటన జరిగింది. పెద్ద కుమారుడిని దింపేందుకు తల్లి స్కూల్ బస్సు దగ్గరికి వెళ్లింది. అయితే ఆమె వెంట బాలుడు కూడా వెళ్లాడు. డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు తీసేయడంతో ఒక్కసారిగా బాలుడు టైర్ కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.