
Sweet vs Salt Curd:పెరుగు మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కడుపు సమస్యలను తగ్గించడంతో పాటు శరీరానికి చల్లదనాన్ని కూడా అంది
స్తాయి. అయితే చాలామంది పెరుగును ఉప్పుతో తింటే, మరికొందరు పంచదార కలిపి తింటారు. ఈ రెండింటిలో ఏది మంచిదనే సందేహం చాలామందికి ఉంటుంది.
నిపుణుల ప్రకారం పెరుగులో ఎక్కువ ఉప్పు కలపడం వల్ల అందులో ఉండే లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియాపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో పెరుగులోని ప్రోబయోటిక్ ప్రయోజనాలు కొంత తగ్గవచ్చు.
తప్పనిసరిగా ఉప్పు కలపాలనుకుంటే సాధారణ టేబుల్ సాల్ట్‌కు బదులుగా నల్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని చాలా తక్కువ మోతాదులో ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అయితే అధిక ఉప్పు తీసుకోవడం రక్తపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చు.
పెరుగులో కొద్దిగా పంచదార కలిపి తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే పెరుగులోని పులుపు తగ్గి రుచి పెరుగుతుంది. అయితే పంచదారను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా మధుమేహం లేదా అధిక బరువు సమస్య ఉన్నవారు చక్కెర వినియోగాన్ని పరిమితం చేయాలి. తీపి కావాలంటే పంచదారకు బదులుగా పండ్ల ముక్కలు కలిపి తినడం మరింత ఆరోగ్యకరం.
కీళ్లవాతం, ఉబ్బసం, తరచూ జలుబు, దగ్గు, కొన్ని కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరుగు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
అలాగే పెరుగును ఎప్పుడూ తాజాగా ఉండేలా చూసుకుని, ఉప్పు లేదా పంచదార రెండింటినీ మితంగానే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారంలో భాగంగా సరైన మోతాదులో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి.