
తెలంగాణ జీవవైవిధ్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం నమోదైంది. భారతదేశంలోనే అతిపెద్ద సీతాకోకచిలుక జాతులలో ఒకటైన 'సదరన్ బర్డ్‌వింగ్' రాష్ట్రంలో తొలిసారిగా వెలుగుచూసింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఈ అరుదైన సీతాకోకచిలుకను అధికారులు గుర్తించారు. ఈ ఆవిష్కరణతో రాష్ట్ర జీవవైవిధ్య రికార్డులలో ఒక కొత్త అధ్యాయం చేరింది.రిజర్వ్‌లోని కొల్లాపూర్ రేంజ్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నీలేష్, వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డాక్టర్ రవికాంత్ ఈ సీతాకోకచిలుకను గుర్తించి, డాక్యుమెంట్ చేశారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్. హిరేమఠ్ సహా ఇతర సీనియర్ అధికారులు వారిని అభినందించారు.సాధారణంగా పశ్చిమ కనుమలకే పరిమితమైన ఈ సీతాకోకచిలుకను 'సహ్యాద్రి బర్డ్‌వింగ్' అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటక రాష్ట్ర అధికారిక సీతాకోకచిలుక. దీని రెక్కల విస్తీర్ణం 140 నుంచి 190 మి.మీ. వరకు ఉంటుంది. తూర్పు కనుమలలోని అమ్రాబాద్ ప్రాంతంలో దీని ఉనికిని గుర్తించడం ఆవాసాల అనుసంధానంపై అధ్యయనానికి కీలకంగా మారింది. ఇప్పటికే 100కు పైగా సీతాకోకచిలుక జాతులకు నిలయమైన అమ్రాబాద్‌లో ఈ కొత్త ఆవిష్కరణ జీవవైవిధ్య ప్రాముఖ్యతను మరింత పెంచింది.