రేషన్ కార్డుల విభజన, రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు ఇకపై మరింత సులభతరం కానున్నాయి. ఈ విషయమై మంత్రి నారా లోకేష్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్‌పై మంత్రి నారా లోకేష్ శుక్రవారం రోజున సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ పనులు జులై నాటికి పూర్తి చేయాలని నారా లోకేష్ ఆదేశించారు. అలాగే కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పౌర సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజలలో మరింతగా అవగాహన కలిగించాలని నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నెలరోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు, అభ్యర్థులకు విద్యా సంస్థలు, క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లన్నీ అభ్యర్థి ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా డీజీ వెరిఫై ద్వారా పారదర్శకంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం, విద్యుత్ సరఫరాపైనా నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.మరోవైపు సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఉపాధ్యాయులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన 37 మంది టీచర్లు ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లి అక్కడి విద్యావిధానాలపై అధ్యయనం జరిపారు. పర్యటన పూర్తి చేసుకుని తిరిగిరాగా.. మంత్రి లోకేష్ వారితో సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసంలో వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగపూర్ అధ్యయన యాత్రలో తాము తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటిని అమలు చేయడానికి గల అవకాశాలను ఉపాధ్యాయులు మంత్రి నారా లోకేష్‌కు వివరించారు. ఈ సందర్భంగా విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా ఛేంజర్స్‌గా తయారు కావాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.