
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Ireland vs India: ప్రపంచకప్ తర్వాత తొలిసారి ఆడుతున్న భారత జట్టు ఐర్లాండ్‌పై ప్రతాపం చూపిస్తుందనుకుంటే తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైంది. టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు అనంతరం తొలిసారి జరిగిన టీ20 సిరీస్‌లో అదీ కూడా పసికూన చేతిలో ఓడిపోయింది. విదేశీ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్‌తో 34 పరుగుల తేడాతో ఘోర పరాభవం ఎదుర్కొన్నది. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజాతులా కోల్పోయింది. ఒక్క బ్యాటర్ కూడా పోరాటం చేయకపోవడంతో టీమిండియా చేతులెత్తేసింది. అగ్ర జట్టయిన భారత్‌పై ఐర్లాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. ఒక్క అభిషేక్ శర్మ మినహా టాప్ బ్యాటర్లను అతి తక్కువ పరుగులకే ఔట్ చేసి సునాయాసంగా ఐర్లాండ్ తొలి విజయాన్ని అందుకుంది.
ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లార్కన్ టకర్ అర్ధ సెంచరీ చేయగా.. గెరత్ డలానే ఒక్క పరుగు తేడాతో అర్థ సెంచరీని కోల్పోయాడు. 36 బంతుల్లో లార్కన్ 50 పరుగులు చేయగా.. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు నమోదు చేశాడు. ఓపెనర్లు టిమ్ టెక్టర్ (17), రాస్ అడైర్ (12) తక్కువ పరుగులు చేయగా.. హ్యారీ టెక్టర్ డకౌటయ్యాడు. అనంతరం వచ్చిన బెన్ కలిట్జ్ 15 పరుగులు చేయగా.. అనంతరం వచ్చిన గరెత్ డలానే 32 బంతుల్లో 49 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు కొట్టి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. జార్జ్ డాక్రెల్ (19), లియామ్ మెక్కార్తి (7) తలా కొన్ని పరుగులు చేశారు.
భారత బౌలర్లు విఫలం పసికూన ఐర్లాండ్‌పై భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆరంభంలో వికెట్లు తీస్తూ జోరు కనబర్చిన బౌలర్లు అనంతరం పరుగులు భారీగా సమర్పించుకున్నారు. వంద పరుగులు చేయడమే గగనం అనుకున్న సమయంలో దాదాపు రెండొందలకు చేరువగా ఐర్లాండ్ బ్యాటర్లు ఆడారు. హర్షిత్ రాణా మూడు వికెట్లతో రాణించగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబే ఒక్క వికెట్ తీశాడు.
కుప్పకూలిన భారత్ మోస్తరు లక్ష్యాన్ని సాధించలేక భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 20 బంతుల్లో 50 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి తనదైన శైలిలో ఆడి గొప్ప ప్రారంభాన్నిచ్చాడు. స్టార్ ప్లేయర్లు సంజూ శామ్సన్ (5), ఇషాన్ కిషణ్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) గ్రౌండ్లోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. తిలక్ వర్మ (19), వాషింగ్టన్ సుందర్ (9) పరుగులు చేయగా.. శివమ్ దూబే విజయం కోసం శ్రమించినా 25 పరుగులకే పరిమితమయ్యాడు. అక్షర్ పటేల్ (8), అర్ష్‌దీప్ సింగ్ (2) పరుగులు తీయకుండా ఓటమిలో భాగమయ్యారు.
ఐర్లాండ్ బౌలర్లు భళా అగ్ర జట్టు అయిన భారత్‌పై ఐర్లాండ్ బౌలర్లు ప్రతాపం చూపించారు. మ్యాథ్యూ హమ్ఫ్రెస్, మ్యాథ్యూ హోలర్డ్ మూడేసి వికెట్లు తీసి అదరగొట్టారు. జై మూండ్ర రెండు వికెట్లు తీయగా.. లియామ్ మెక్కార్తి, గరెత్ డెలానే ఒక్కో వికెట్ తీశారు.