
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
RS Praveen Kumar Security Withdraw: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత తొలగించడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, లోపాలను ఎత్తి చూపుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ తీసేస్తే ఆయనను చంపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా అనే అనుమానం కలుగుతోందని గులాబీ పార్టీ పేర్కొంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగింపుపై హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ తొలగించడం సరైంది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
కక్ష సాధింపు చర్యలు 'ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతుండడంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అసహనంతో నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి ఐపీఎస్ అధికారి, అనేక అవార్డ్స్ వచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గురుకులాల కార్యదర్శిగా అద్భుతంగా పని చేశారు. కాంగ్రెస్ హయాంలో సమర్థవంతంగా కూడా ఆయన పనిచేశాడు. సమర్థవంతంగా పనిచేయడంతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ప్రాణహానీ ఉంది' అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సెక్యూరిటీ తీసేస్తే ఎలా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బతికినంత కాలం సెక్యూరిటీ ఇవ్వాలని ఇంటిలిజెన్స్ నివేదిక ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధంగా ప్రవీణ్ కుమార్ భద్రతా తొలగించారు. రాష్ట్రపతి అవార్డు, సెక్యూరిటీ అవార్డు పొందిన ప్రవీణ్ కుమార్‌కే సెక్యూరిటీ తీసేస్తే ఎలా?' అని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. సిర్పూర్- కాగజ్‌నగర్ మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తీసేస్తే ఆయన్ని చంపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అనే అనుమానం కలుగుతుంది' అని సంచలన ఆరోపణలు చేశారు.
'రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కూడా ప్రాణహాని ఉన్న అధికారులకు భద్రత ఇవ్వాలని చెబుతుంది. ప్రజా జీవితంలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత పెంచాల్సింది పోయి తీసేయడం ఎంతవరకు సమంజసం?' అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఆపద పొంచి ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. ముప్పు ఉన్నవారికి సెక్యూరిటీని ఇష్టానుసారంగా తీసేస్తే కోర్టులు ఒప్పుకోవని గుర్తుచేశారు.
వందకు వంద శాతం 'రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల సెక్యూరిటీ తీసేస్తే, భవిష్యత్ లో ఊర్లో తిరగలేరు, ఇంట్లో ఉండలేరు' అని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.