అయోధ్య రామమందిర విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఈ వివాదంలోకి బాబ్రీ మసీదు అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు...
అయోధ్య రామమందిర విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఈ వివాదంలోకి బాబ్రీ మసీదు అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బాబ్రీ మసీదు నిర్మాణం కోసం సేకరించిన విరాళాల గురించి ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు.మిర్జాపూర్లో విలేకరులతో మాట్లాడుతూ, రామమందిర విరాళాల వివాదం వెనుక సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల కుట్ర ఉందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం, ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకే ఆ పార్టీలు సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని విమర్శించారు. "గతంలో బాబ్రీ మసీదు కోసం కూడా విరాళాలు సేకరించారు. ఆ నిధులు ఏమయ్యాయో ఎవరూ అడగరు. విపక్షాలవి కేవలం బుజ్జగింపు రాజకీయాలే" అని ఆయన దుయ్యబట్టారు. ఆ నిధుల వివరాలపై విపక్ష నేతలను ప్రశ్నించాలని ఆయన మీడియాకు సూచించారు.అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడి ఫిర్యాదు మేరకు సిట్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో అయోధ్య పోలీసులు గురువారం ఎనిమిది మందితో పాటు మరికొందరిపై దొంగతనం, నేరపూరిత నమ్మకద్రోహం, కుట్ర వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తుపై బ్రజేష్ పాఠక్ స్పందిస్తూ, తమ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులే నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారని ఆయన పేర్కొన్నారు.