
వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భూకంపాలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వెనెజువెలాను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ అమిస్టాడ్ను ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భూకంపాలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వెనెజువెలాను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ అమిస్టాడ్ను ప్రారంభించింది. స్పానిష్ భాషలో అమిస్టాడ్ అంటే స్నేహం. భూకంప బాధితులను ఆదుకునేందుకు వీలుగా ఒక ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌తో పాటు ఇతర సహాయక సామగ్రిని రెండు సీ17 ట్రాన్స్‌పోర్టు విమానాల్లో పంపించింది. మొత్తం 35 టన్నుల సామగ్రిని పంపించామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే తొలిదేశంగా భారత ప్రతిష్ఠ ఈ ఆపరేషన్‌తో ఇనుమడించిందని అన్నారు.
క్షతగాత్రులకు వైద్యసాయం సాయం అందించేందుకు ఆర్మీ ప్రత్యేక మెడికల్ బృందాన్ని ఇప్పటికే పంపించామని భారత ఆర్మీ తెలిపింది. పారాఫీల్డ్ ఆర్మీకి చెందిన 41 మంది మెడికల్ సిబ్బంది ఉన్నారని ఆర్మీ వర్గాలు చెప్పాయి. వీరులో 9 మంది మెడికల్ ఆఫీసర్లు కూడా ఉన్నారని వెల్లడించాయి. వెనెజువెలాలో ఈ బృందం ఎమర్జెన్సీ వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి క్షతగాత్రులకు వైద్యం అందిస్తుంది. ట్రామా మేనేజ్మెంట్, ఎమర్జెన్సీ సర్జరీల వంటి క్రిటికల్ వైద్య సేవలు అందించడం ఈ బృందం ప్రత్యేకత అని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
క్షతగాత్రులకు అత్యవసర వైద్య సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ఫీల్డ్ ఆసుపత్రిని కూడా భారత్ పంపించింది. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు తక్షణసాయం అందించే తాత్కాలిక ఆసుపత్రిగా ఈ మాడ్యులార్ వైద్య కేంద్రం ఉపయోగపడుతుంది. ఈ ఆసుపత్రిలో ఒకేసారి 200 మందికి వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. పోర్టబుల్ వెంటిలేటర్లు, పేషెంట్ మానిటర్లు, డయాగ్నస్టిక్ సాధనాలు, ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలు, విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి అన్ని వసతులు ఈ కేంద్రంలో ఉంటాయి. గతంలో ప్రకృతి విపత్తుల సమయంలో భారత్ ఇదే విధంగా పొరుగు దేశాలకు సాయం అందించింది. ఇక వెనెజువెలాలో మరణాల సంఖ్య 235కు చేరింది. మరో 4,300 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై..
వెనెజువెలాలో శిథిలాల మధ్య బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..