
Jagannath Rath Yatra 2026:ఒడిశాలోని పూరీ నగరం శ్రీ జగన్నాథ స్వామి నివాసంగా ఎంతో పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర కోసం లక్షలాది మంది
భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ మహోత్సవం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ పండుగల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పూరీకి చేరుకుని ఈ వేడుకలో పాల్గొంటారు.
2026 సంవత్సరంలో జగన్నాథ రథయాత్ర జూలై 16, గురువారం ప్రారంభమవుతుంది. జూలై 24న జరిగే బహుడా యాత్రతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథుడు, ఆయన అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్ర అమ్మవారు మూడు భారీ రథాలపై గుండిచా ఆలయానికి ఊరేగింపుగా వెళ్తారు. వేలాది మంది భక్తులు ఈ రథాలను భక్తిశ్రద్ధలతో లాగడం ఈ ఉత్సవంలోని ప్రధాన ఆకర్షణ.
పురాణాల ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి రోజున శ్రీ జగన్నాథ స్వామి జన్మదినంగా భావిస్తారు. ఆ రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిని ఆలయంలోని సింహాసనం నుంచి తీసుకువచ్చి ప్రత్యేక స్నాన మండపంలో 108 కలశాల పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఈ పవిత్ర స్నానాన్ని "స్నాన యాత్ర" అని పిలుస్తారు.
ఈ అభిషేకం అనంతరం చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల స్వామివారికి జ్వరం వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే దేవుళ్లను సుమారు 15 రోజుల పాటు ప్రత్యేక గదిలో ఉంచుతారు. ఈ సమయంలో సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. ఆలయ ప్రధాన సేవకులు, అర్చకులు మాత్రమే ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు.
ఆ తర్వాత ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున "ఛేరా పహారా" అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో పూరీ గజపతి మహారాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాకే రథయాత్ర ప్రారంభమవుతుంది.
జగన్నాథ రథయాత్ర భక్తి, సంప్రదాయం, సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పండుగలో పాల్గొనడం లేదా రథాన్ని లాగడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.