
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన 12 ఏళ్ల సినీ ప్రయాణం గురించి ఎమోషనల్ అయ్యారు. మోడలింగ్ రోజుల్లో తాను పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కెరీర్ ప్రారంభంలో తన మొదటి ఫొటో షూట్, మొదటి ర్యాంప్ వాక్ రెండూ పూర్తిగా ఫ్లాప్ అయ్యాయని ఆమె తెలిపారు. ఆ సమయంలో తీవ్ర నిరాశకు గురై ఇంటికి వెళ్లి ఎంతో ఏడ్చానని ఈ బ్యూటీ పేర్కొన్నారు. అయితే ఎక్కడా పట్టుదల వదలకుండా మళ్లీ వరుసగా ఆడిషన్లు ఇస్తూ ముందుకు సాగానని ఆమె వెల్లడించారు. ఆ రోజు చూపించిన పట్టుదలే ఈరోజు తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని కృతి సనన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజంపై కృతి సనన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లాంటి స్టార్ కిడ్స్‌కు మంచి టాలెంట్ ఉందని ఆమె ప్రశంసించారు. వారు తమ ప్రతిభను కష్టపడి నిరూపించుకున్నారని ఈ సందర్భంగా కృతి సనన్ గుర్తుచేశారు. కానీ టాలెంట్ లేని కొందరు మాత్రం కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో 8 నుంచి 9 ఏళ్లు వరుసగా అవకాశాలు పొందడం తీవ్ర అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ లేని నటీనటులు మొదటి 2 లేదా 3 ఏళ్లలో హిట్ కొట్టకపోతే ఇండస్ట్రీ వారిని పక్కకు నెట్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కృతి సనన్ ఇటీవల ‘కాక్టెయిల్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించారు. ఈ విజయంతో జోరు మీదున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శౌర్యువ్ కలయికలో రాబోతున్న ఒక భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రంలో నటించే అవకాశం కృతికి దక్కినట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వరుస విజయాలు, క్రేజీ ఆఫర్లతో కృతి సనన్ కెరీర్ ప్రస్తుతం సరికొత్త మలుపు తిరుగుతోంది.