రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో శతాబ్దాల రాచరిక సంప్రదాయం సరికొత్త మార్పునకు ప్రతీకగా నిలిచింది. ఖేర్వాగఢ్ రాచరిక కుటుంబ వారసత్వ పగ్గాలను 13 ఏళ్ల బాలిక తేజస్వి కుమారి జోధా చేపట్టింది.
ఆమె తండ్రి మరణం తర్వాత.. ఖేర్వాగఢ్ రాజకుటుంబ సాంప్రదాయ పద్ధతిలో తేజస్వికి అధికారికంగా తలపాగా చుట్టారు. వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం.. ఆ గ్రామ రాజపురోహితుడు తనవేలిని కోసుకుని, ఆమె నుదుట 'రక్త తిలకం' దిద్దారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ‘ పాగ్ కా దస్తూర్ ’లో మొదటిసారిగా ఒక చిన్నారి ఈ వేడుకకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఇప్పటివరకు కేవలం వారసులుగా మగ పిల్లలకు మాత్రమే పరిమితమైన ఈ సాంప్రదాయానికి భిన్నంగా తేజస్వి కుమారి జోధాను ఆమె తండ్రికి అసలైన వారసురాలిగా గుర్తించారు.17వ శతాబ్దానికి చెందిన చారిత్రక ఖేర్వా కోటలో వందలాది మంది గుమికూడగా, ఈ 13 ఏళ్ల బాలిక గంభీరంగా కూర్చుని వేడుకలో పాల్గొంది. వేద మంత్రాలు మారుమోగుతుండగా, సుదీర్ఘమైన ఈ ఆచారాలు జరుగుతున్నంతసేపూ తేజస్వి ఎంతో నిబ్బరంగా ఉంది. సంతాప దినాలు ముగింపునకు సూచనగా ఆమె తలకు గులాబీ రంగు పాగాను చుట్టారు. జోధ్‌పూర్-మార్వాడ్ రాజు గజ్ సింగ్ తరపున ఆయన ప్రతినిధి ఈ సాంప్రదాయ తలపాగాను అందజేశారు.ఒకప్పుడు జోధ్‌పూర్ రాజ్యంలో పాలి గ్రామాలలో కుటుంబ పెద్ద మరణిస్తే ఆయన వారసుడు ఈ తలపాగాను ధరించడం ఆనవాయితీ. నేటికీ ఈ ఆచారంలో భాగంగా జోధ్‌పూర్ రాజకుటుంబం నుంచే ఈ సాంప్రదాయ తలపాగా వస్తుంది. ఈ వేడుక ఒక తరం నుంచి తరువాతి తరానికి బాధ్యతల బదిలీని సూచిస్తుంది. కానీ, చారిత్రాత్మకంగా రాజ్‌పుత్ కుటుంబాలలో ఇటువంటి ఆచారం కేవలం కుమారులకు మాత్రమే పరిమితమైంది. అందుకే తేజస్వికి జరిగిన ఈ పట్టాభిషేకం అత్యంత అరుదైనదిగా నిలిచింది. ఖేర్వాగఢ్ కుటుంబంలో మగ సంతానం లేకపోవడం వల్ల గత 65 ఏళ్లుగా ఈ వేడుక జరగలేదు. ఈ సాంప్రదాయాన్ని అంతరించి పోకూడదని భావించిన పెద్దలు.. హరీష్ చంద్ర జోధా ఏకైక కుమార్తెను ఆయన వారసురాలిగా గుర్తించాలని నిర్ణయించారు.రాజ్‌పుత్ కుటుంబాల్లో శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. కానీ ఒక బాలిక తన తండ్రి రాచరిక వారసత్వానికి సంరక్షకురాలిగా గుర్తింపు పొందడం, ఆమెకు ఈ వేడుక నిర్వహించడం ఇదే మొదటిసారి. ఖేర్వాగఢ్ కుటుంబానికి వారసుడు లేకపోవడంతో 65 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ వేడుక జరగడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.స్థానిక జానపద గాథరాజస్థానీ జానపద కథల ప్రకారం.. ఖేర్వాగఢ్ కుటుంబం జోర్జీ చంపావత్ శాపానికి గురైంది. జోర్జీ చంపావత్ను ఆయన మేనబావ అయిన ఖేర్వాగఢ్ ఠాకూర్ మోసగించాడని కథనం. ఖేర్వాగఢ్లో ఆయనపై దాడి చేసినప్పుడు చనిపోయే ముందు ఆయన ఆ కుటుంబాన్ని శపించాడని, వారికి ఇకపై ఎన్నడూ మగ సంతానం కలగదని స్థానికులు నమ్ముతారు. 1873- 1895 మధ్య కాలంలో జరిగిన ఈ ఘోరాన్ని ఈ ప్రాంతంలోని జానపద గీతాలు నేటికీ గుర్తుచేస్తూ ఉంటాయి. ఈ కథల ప్రకారం.. కుట్రతో జోర్జీ చంపావత్ను చంపినప్పటికీ, ఈ సమయంలో తనపై దాడి చేసిన పలువురిని చంపేశాడు. అలాగే ఖేర్వాగఢ్ పాలకులకు ఇకపై ఎన్నడూ మగ వారసుడు ఉండడని శపించాడు.అది శాపమో లేదా యాదృచ్ఛికమో కానీ, 1895 నుంచి ఖేర్వాగఢ్ పాలకులకు మగ పిల్లలు పుట్టలేదు. తేజస్వి తండ్రి అయిన హరీష్ చంద్ర జోధా కూడా ఈ కుటుంబానికి దత్తతగా వచ్చారు. 13 ఏళ్ల తేజస్విని వారసురాలిగా ప్రకటిస్తూ ఈ పాగా వేడుకను నిర్వహించాలనే నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. వందల ఏళ్ల సాంప్రదాయాలను పక్కనబెట్టి ఒక బాలికకు 'రాజ తిలకం' దిద్దడాన్ని చూసేందుకు చుట్టుపక్కల నుంచి భారీగా జనం తరలివచ్చారు.పక్క గ్రామం ఔవాకు చెందిన పుష్పేంద్ర సింగ్ మాట్లాడుతూ: ‘దివంగత ఠాకూర్ సాబ్ 78 ఏళ్ల వయసులో మరణించారు.. ఆయనకు మగ సంతానం లేకపోవడంతో, సమాజంలోని పెద్దలంతా కలిసి ఆయన కుమార్తెనే తదుపరి వారసురాలిగా చేయాలని నిర్ణయించారు.. ఈ వేడుకకు జోధ్‌పూర్ రాజకుటుంబం నుంచి తలపాగా వస్తుంది.. ఆపై రాజపురోహితుడు వేలు కోసుకుని వచ్చిన రక్తంతో నుదుటిపై తిలకం దిద్దుతారు.. తేజస్వికి కూడా ఇలాగే చేశారు. నేటి ఆధునిక భారతదేశంలో మహిళలకు, పురుషులకు తేడా లేదు, అందుకే అందరూ కలిసి ఒక ముందడుగు వేయాలని, పాత ఆచారాన్ని పక్కనబెట్టి ఆయన కుమార్తెకు ఈ వేడుక చేయాలని నిర్ణయించారు’’ అని చెప్పారు.మార్వాడ్ ప్రాంతంలోని సాంప్రదాయ రాజ్‌పుత్ కుటుంబాలలో ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు అని ఈ వేడుకకు హాజరైన స్థానికుడు ధన్ సింగ్ రణావత్ అన్నారు. సామాజిక సంస్కర్త అయిన తేజస్వీ తండ్రి రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారని, గ్రామానికి ఎంతో సేవచేశారని అన్నారు. 400 ఏళ్ల నాటి ఈ సంప్రదాయంలో ఆయన కుమార్తెను వారసురాలిగా గుర్తించడం ద్వారా మహిళా సాధికారికతను ప్రోత్సహించినట్లవుతుందని, ఇది ఆయనకు మేము ఇచ్చే గొప్ప గౌరవమని భావించామని చెప్పారు. తేజస్వి ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యింది. ‘‘నేను 7వ తరగతి చదువుతున్నాను.. ప్రస్తుతానికి నా దృష్టి అంతా చదువుపైనే ఉంది.. ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించడానికి, మా నాన్న తన గ్రామాభివృద్ధి గురించి కన్న కలలను నిజం చేయడానికి నేను ప్రయత్నిస్తాను’’ అని చెప్పడం గమనార్హం.