GVMC On Road side parking : రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్ చేస్తున్నారా.. కొద్దిసేపట్లో వచ్చేస్తాము కదా.. ఏమీ కాదులే అని భావిస్తున్నారా.. అలాంటి వారికి ముఖ్య గమనిక.
ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ, ట్రాఫిక్ నిర్వహణకు అంతరాయం కలిగించే విధంగా రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను నిలిపే వాహనదారులకు జీవీఎంసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. గురువారం చేపట్టిన క్షేత్రస్థాయి తనిఖీలో భాగంగా, కమిషనర్ జీవీఎంసీ సౌత్ జోన్ పరిధిలోని జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పార్కింగ్ కార్యకలాపాలు, వాహనాల రాకపోకలు, వినియోగ స్థాయిలను పరిశీలించారు. అలాగే మల్టీ లెవర్ కార్ పార్కింగ్ సెంటర్ నిర్వహణ, వినియోగానికి సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, నగరవాసులకు సౌకర్యవంతమైన పార్కింగ్ సౌకర్యాన్ని అందించడం అనే లక్ష్యంతో, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ నిర్మించారు. భారీగా నిధులు ఖర్చు చేసి ఆధునిక సౌకర్యాలతో ఈ కార్ పార్కింగ్ సదుపాయాన్ని అభివృద్ధి చేశామని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. రోడ్డు పక్కన వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని.. పారిశుధ్య కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. వీటితో పాటుగా రోడ్డుపై నడిచేవారికి, ప్రయాణికులకు కూడా అసౌకర్యం కలుగుతుందని జీవీఎంసీ కమిషనర్ గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇకపై, రోడ్లపై అక్రమంగా, అసౌకర్యంగా వాహనాలు నిలిపితే అలాంటి వాహనదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీటీవీ నిఘా ద్వారా అలాంటి వారిని గుర్తించి, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.