
కేతన్ అగర్వాల్ దారుణ హత్య నిందితులకు ఉరిశిక్ష వేయాలన్న తండ్రి ముమ్మరంగా పోలీసుల సిట్ దర్యాప్తు Ketan Agarwal Murder Case: పూణే సమీపంలోని లోహ్‌గఢ్ కోటపై నుంచి పడి మరణించిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ ఉదంతం.
. పథకం ప్రకారం జరిగిన హత్యగా తేలడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేతన్(Ketan Agarwal Murder Case) కాబోయే భార్య సియా గోయల్, ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. జూన్ 18న జరిగిన ఈ ఘటనను తొలుత ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, లోనావాలా రూరల్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. సియా, చేతన్‌లు ఇద్దరూ కలిసి కేతన్పై దాడి చేసి, కోటపై నుంచి కిందకు తోసేసినట్లు విచారణలో అంగీకరించారని పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ వెల్లడించారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలన్న తండ్రి ఆవేదన: ఈ ఘోర ఉదంతంపై కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన స్వయంగా కలిసి వేడుకున్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కేతన్కు తలపై చిన్న హెయిర్ ప్యాచ్ ఉందన్న కారణంతోనే ఈ హత్యకు ప్లాన్ చేశారా అని విలేకరులు ప్రశ్నించగా, "వివాహానికి ముందే ఈ విషయాన్ని వారి కుటుంబానికి స్పష్టంగా చెప్పాం.. కేవలం ఒక చిన్న విగ్ కారణంగా ఎవరైనా మనుషులను చంపుతారా?" అని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. పెళ్లి ఇష్టం లేకపోతే నిరాకరించవచ్చు కానీ, ఇంత క్రూరమైన మనస్తత్వంతో ప్రాణాలు తీయడం దారుణమని మండిపడ్డారు. కుట్రల వెనుక బయటపడ్డ మరిన్ని కోణాలు: ఈ హత్య వెనుక గత కొన్ని రోజులుగా పక్కా ప్లాన్ జరిగినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఈ నెల 6న కేతన్, సియా ఇద్దరూ కలిసి బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, విమానాశ్రయంలో కేతన్ పాస్‌పోర్ట్ మాత్రమే మాయం కావడంతో అతను వెనక్కి తిరగాల్సి వచ్చింది. కోట ట్రెకింగ్‌కు వెళ్దామని సియానే బలవంతం చేసిందని, గత ఏడాది కాలంగా ఆమె చేతన్‌తో పరిచయం కలిగి ఉందని దర్యాప్తులో తేలింది. తమతో ఎంతో ఆప్యాయంగా ఉంటూ, షాపింగ్‌లు, డిన్నర్లకు వచ్చిన సియా.. ఇంత పెద్ద దగా చేస్తుందని తాము ఊహించలేదని కేతన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి, తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.