తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి తమకు తోచిన విధంగా డబ్బులు, బంగారం, వెండి, విలువైన వస్తువులు, వాహనాలు, టీటీడీకి అవసరమైన యంత్రాలను కూడా అందిస్తుంటారు.
టీటీడీ ప్రజలు, భక్తుల కోసం నిర్వహించే సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులకు కూడా భక్తులు విరాళాలు అందజేస్తుంటారు. తిరుమల శ్రీవారి పేరుతో టీటీడీ నిర్వహించే ట్రస్టుల ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లలో టీటీడీ ట్రస్టులకు భక్తుల నుంచి విరాళాలు పెరిగాయి.. తాజాగా మరికొందరు భక్తులు భారీగా విరాళాలు అందజేశారు.ఇవాళ హైదరాబాద్‌కు చెందిన సాయి బాలాజీ డెవెలపర్స్ సంస్థ టీటీడీకి భారీ విరాళం అందించింది. టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 45 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు సాయి బాలాజీ డెవెలపర్స్ సంస్థ పార్ట్నర్ ఆకుల రవి కుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన రచన టెలివిజన్ సంస్థ టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి (స్విమ్స్) రూ. 16 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి తోట శ్రావణ్ కుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు.అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామి అలంకారంలో దివ్య మంగళ దర్శనం ప్రసాదించి భక్తులను అనుగ్రహించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పంచభౌతిక ప్రకృతికి ప్రతీకగా భావిస్తారు. పంచశిరస్సులతో కూడిన చిన్నశేషునిపై స్వామివారిని దర్శించడం ద్వారా భక్తులకు సర్వశుభాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని ఆగమ, పురాణాలు పేర్కొంటున్నాయి.బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ వైభవంగా నిర్వహించనున్నారు.