
ఇంటర్నెట్ డెస్క్: శతాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని ప్రకృతి విపత్తుతో వెనెజువెలా దేశం అల్లకల్లోలంగా మారింది. వెనువెంటనే రెండు భారీ భూకంపాలు (Venezuela Earthquake) విరుచుకుపడటంతో ఎటు చూసినా ధ్వంసమైన...
ఇంటర్నెట్ డెస్క్: శతాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని ప్రకృతి విపత్తుతో వెనెజువెలా దేశం అల్లకల్లోలంగా మారింది. వెనువెంటనే రెండు భారీ భూకంపాలు (Venezuela Earthquake) విరుచుకుపడటంతో ఎటు చూసినా ధ్వంసమైన భవంతులు.. శిథిలాల దిబ్బలే కన్పిస్తున్నాయి. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన వెనెజువెలాలో సంభవించిన ఈ విలయంతో ఇప్పుడు చమురు సరఫరా (Oil Supply)పై ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా దిగుమతులపై అత్యధికంగా ఆధారపడే భారత్ లాంటి దేశాలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది..? దీని వల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? తెలుసుకుందాం..!
రాజధాని కారకస్ సహా వెనెజువెలా వ్యాప్తంగా పలు నగరాలను ఈ భారీ భూకంపాలు వణికించాయి. అయితే, ఇప్పటివరకు చమురు మౌలిక సదుపాయాల పరిస్థితిపై స్పష్టత లేదు. రిఫైనరీలు, ఎక్స్పోర్ట్ టెర్మినళ్లు, పైప్లైన్లకు ఎంత మేర నష్టం వాటిల్లిందనే దానిపై అధికారిక సమాచారం ఏదీ రాలేదు. భూకంపం కారణంగా చమురు క్షేత్రాలు దెబ్బతినలేదని కొన్ని అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. చమురు ఉత్పత్తికి ఇప్పటివరకు అంతరాయం కలగలేదని తెలిపాయి. అయితే, విపత్తు కారణంగా విద్యుత్‌కు అంతరాయం కలగడం, రవాణా వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
వెనెజువెలాకు ప్రధాన కార్గో గేట్‌వే అయినా ‘లా గువేరా’ నగరం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చమురు లోడింగ్ ఆలస్యం, రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం వంటివి ట్రేడర్లు, రిఫైనర్లు, బీమా సంస్థలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు దిగుమతుల కోసం భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లను (Oil Imports) భారీగా పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశం నుంచి సగటు నెలవారీ దిగుమతులు 64వేల మెట్రిక్ టన్నులుగా ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే మధ్యలో ఈ మొత్తం 10లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడం గమనార్హం. ఇక, ఆ దేశ చమురు రంగంలోనూ భారత్ ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టింది.
అయితే, వెనెజువెలా పరిణామాలతో భారత్‌లో తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని మార్కెట్ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణా పెరిగింది. అంతర్జాతీయంగానూ ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పాటు గత కొన్నేళ్లుగా చమురు దిగుమతుల కోసం భారత్ ప్రత్యామ్నాయ వనరులను ఎంచుకోవడంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే దాదాపు 35కు పైగా దేశాల నుంచి ఈ దిగుమతులు చేసుకుంటోంది. అందువల్ల, వెనెజువెలా నుంచి తాత్కాలికంగా ఎగుమతులు నెమ్మదించినా.. భారత్‌కు ప్రత్యామ్నాయ సోర్సులు అందుబాటులోనే ఉన్నాయని ఎనర్జీ నిపుణులు పేర్కొంటున్నారు.
కాగా.. భూకంపాలు సంభవించిన అనంతరం చమురు క్షేత్రాల పరిస్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. భూగర్భ పైప్‌లైన్ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలు ఎంతమేర దెబ్బతిన్నాయో తెలియాంటే కొన్ని వారాల సమయం పడుతుంది. అందువల్ల పరిస్థితిని ఇప్పుడే అంచనా వేయలేమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.