
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అమెరికాకు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన తుర్కియే చివరి మ్యాచుల్లో యూఎస్‌ను ఓడించింది.
అందరూ డ్రా అవుతుందని భావించిన ఈ మ్యాచ్‌లో తుర్కియే సంచలన విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. చిన్న జట్లు సైతం పెద్ద జట్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. అంతేకాక కొన్ని మ్యాచుల్లో విజయం సాధించి, ఇంకొన్ని మ్యాచుల్లో డ్రా చేసుకుంటూ పెద్ద జట్లకు గట్టి షాక్ ఇస్తున్నాయి. అలానే తాజాగా తుర్కియే సంచలన విజయం నమోదు చేసింది. గ్రూప్-డిలో ఇప్పటికే అగ్రస్థానంతో నాకౌట్‌కు అర్హత సాధించిన అమెరికాను 3-2 తేడాతో తుర్కియే ఓడించింది. ఈ లీగ్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన తుర్కియే.. పరువు కాపాడుకునేందుకు ఆడిన ఈ మ్యాచ్‌లో అద్భుత పోరాటపటిమను కనబరిచింది. సోఫియా స్టేడియంలో ప్రేక్షకుల కేరింతల మధ్య జరిగిన ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
ఈ మ్యాచ్‌లో అమెరికా తొమ్మిది మార్పులతో బరిలోకి దిగింది. మ్యాచ్ ప్రారంభమైన 3వ నిమిషంలోనే సెల్టిక్ డిఫెండర్ ఆస్టన్ ట్రస్టీ లభించిన కార్నర్ అవకాశాన్ని గోల్‌గా మలిచి అమెరికాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. వెంటనే తుర్కియే స్టార్ ప్లేయర్ అర్దా గులెర్ కూడా 10వ నిమిషంలోనే మెరుపు గోల్‌తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 31వ నిమిషంలో ఎల్మాలి పాస్‌ను బారిస్ యిల్మాజ్ గోల్‌గా మలిచాడు. దీంతో ప్రథమార్ధంలో తుర్కియే 2-1 ఆధిక్యంలో నిలిచింది.
రెండవ అర్ధభాగంలో పుంజుకున్న అమెరికా తరఫున 49వ నిమిషంలో సెబాస్టియన్ బెర్హాల్టర్ చక్కని లో-షాట్‌తో స్కోరును 2-2తో సమం చేశాడు. అనంతరం స్టార్ ఆటగాడు క్రిస్టియన్ పులిసిక్ మైదానంలోకి రావడంతో స్టేడియం మార్మోగిపోయింది. పులిసిక్ గోల్ కొట్టేందు కొన్ని అద్భుత ప్రయత్నాలు చేసినప్పటికీ తుర్కియే డిఫెండర్ల శ్రేణిని ఛేదించలేకపోయాడు. ఈ క్రమంలో అందరూ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని భావించారు. అయితే చివరి నిమిషంలో తుర్కియే ఆటగాడు కాన్ అయ్హాన్ సాధించిన గోల్ అమెరికాను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఓటమి నాకౌట్ పోరుకు ముందు అమెరికాకు హెచ్చరికలాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. అలానే జపాన్-స్వీడన్ మ్యాచ్ 1-1తో డ్రా ముగిసింది.
అరుదైన రికార్డు సాధించిన న్యూజిలాండ్ ఓపెనర్లు