
Ram temple | లఖ్నవూ: రామ మందిర విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా చేశారు.
ఈ కేసులో తన డ్రైవర్ అరెస్టయిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్టు పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆయనతో పాటు ట్రస్టుకు చెందిన మరో సభ్యుడు అనిల్ మిశ్రా కూడా తన బాధ్యతల నుంచి వైదొలిగారు.
అయోధ్య రామాలయానికి అందిన విరాళాలపై వచ్చిన ఆరోపణల మీద తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం పోలీసు కేసు నమోదైంది. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండ్రోజుల క్రితం తమ ప్రాథమిక నివేదికను యూపీ సర్కారుకు సమర్పించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసిందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ వెల్లడించారు. ఈ ఉదంతంలో పాలు పంచుకున్న ఎవరినీ ఉపేక్షించబోమన్నారు. సనాతన ధర్మం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. ‘అయోధ్య మందిరంలో జరిగిన ఘటనపై ఎవరూ చింతించకండి. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిని విడిచిపెట్టబోం. ఇది భక్తుల మనోభావాలకు, విశ్వాసానికి సంబంధించిన విషయం’’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గతంలో రామమందిరానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే.. నిధుల దుర్వినియోగంపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.