
మహిళా సాధికారత, అభివృద్ధి మరియు నాయకత్వ వికాసమే లక్ష్యంగా అమెరికాలో విజయవంతంగా కొనసాగుతున్న ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) సేవలు ఇండియాలోనూ ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అట్టహాసంగా జరిగిన వేటా ఇండియా ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మరియు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి వెటా ఫౌండర్ మరియు చైర్పర్సన్ ఝాన్సీ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు భారతీయ మహిళా జాతీయ సమాఖ్య సీనియర్ లీడర్ ప్రేమ్ పావని, భారతీయ మహిళా మోర్చా తెలంగాణ శాఖ అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మరియు వెîటా ప్రతినిధులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అభితేజ కొండ, సునీత గంపా, శైలజా కల్లూరి, విశ్వ వేమిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అవకాశం,ప్రోత్సాహం లభిస్తే ప్రతి రంగంలోనూ వారు అద్భుత విజయాలు సాధించగలరని అన్నారు. మహిళా సాధికారతకు వెటా వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇటువంటి వేదికలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళా సాధికారత పై హనుమండ్ల ఝాన్సీ ఇండియాలో వెటాసంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. అన్ని రంగాల్లో తము ఉన్నామంటూ మహిళలు రాణిస్తున్నారన్నారు. రవాణా శాఖ కి మహిళలతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళలను బస్సు యాజమానులుగా చేశామని, ఉచిత ప్రయాణమే కాదు బస్సులు యజమానులు అయ్యారన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు , నూతన రేషన్ కార్డులు అన్ని ఇంటి యజమాని పేరు మీదనే ఇస్తున్నామన్నారు. తెలంగాణలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఎంత కష్టపడినా ప్రతిభ చూపినా సరే మహిళకు ఎక్కడో అడ్డుకట్ట పడుతోందన్నారు. సమాజంలో మార్పు కోసం అందరూ కృషి చేయాలన్నారు. మహిళలు తమ లక్ష్యంపై నిర్ణయం తీసుకుంటే మీ మాట మీరే వినవద్దు అన్నారు. మహిళ సాధికారత కోసం వెటా ఇండియా సంస్థ, ఆ సంస్థ అధినేత ఝాన్సీ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. మహిళల కోసం మనం ఎంత చేసినా సరే ఒక్క అడుగు మిగిలే ఉంటుందన్నారు. మహిళలంతా కూడా ఒక్కటే. మనమంతా ఒక్కటే కులంఅన్నారు. తెలంగాణ వచ్చాక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు సాధించుకున్నామన్నారు. ఇప్పటికీ 2026 లో కూడా మన రాష్ట్రంలో 15-19 ఏళ్లలో పెళ్లై అమ్మలు అయిన వాళ్లు 7.2 శాతం ఉన్నారని, హైదరాబాద్ లో కూడా టీనేజ్ మదర్స్ 2.7 శాతం ఉన్నారన్నారు. ప్రభుత్వాలు టీనేజ్ మ్యారేజ్ లను తగ్గించేందుకు ఎంత ప్రయత్నం చేసిన సరే పెద్దగా మార్పు రావటం లేదన్నారు. నిర్ణయం తీసుకోనే వద్దు.. తీసుకుంటే మాత్రం మీ మాట మీరే వినకుండా కష్టపడాలన్నారు.
అమెరికాలో ఇప్పటికే మహిళా అభివృద్ధి, నెట్వర్కింగ్, లీడర్షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన వెటా.. ఇప్పుడు ఇండియాలోనూ మహిళలకు ఒక బలమైన వేదికగా మారబోతోందని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు.ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.