
ముందే నిర్ధారణతో చెక్ లేకుంటే తల్లీబిడ్డలకు ఇబ్బందులు గాంధీ ప్రీ-ఎక్లెంప్సియా క్లినిక్‌లో చికిత్సలు ప్రసవానికి ముందు, తర్వాత వైద్యుల పర్యవేక్షణ హైదరాబాద్ సిటీ: గర్భిణులకు మొదటి నెల నుంచి పురిటి...
ముందే నిర్ధారణతో చెక్ లేకుంటే తల్లీబిడ్డలకు ఇబ్బందులు గాంధీ ప్రీ-ఎక్లెంప్సియా క్లినిక్‌లో చికిత్సలు ప్రసవానికి ముందు, తర్వాత వైద్యుల పర్యవేక్షణ హైదరాబాద్ సిటీ: గర్భిణులకు మొదటి నెల నుంచి పురిటి నొప్పుల వరకు అడగడుగునా అగ్నిపరీక్షే.. ప్రసవానికి ముందు, తర్వాత కూడా అనేక సవాళ్లు వారిని వెంటాడుతూనే ఉంటాయి. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో వచ్చే హైబీపీ వారిని తీవ్రంగా వేధిస్తుంటుంది. గర్భిణులు, బాలింతలకు వచ్చే హైబీపీని వైద్యపరిభాషలో ‘ప్రీ-ఎక్లాంప్సియా’(pre -eclampsia)గా వైద్యులు వ్యవహరిస్తుంటారు. అధికరక్తపోటు వస్తే కడుపులో ఉన్న బిడ్డకు ముప్పుగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా సమస్యకు ముందు నుంచే చెక్ పెట్టడానికి గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లినిక్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రీ - ఎక్లాంప్సియా అంటే.. గర్భధారణ సమయంలో సాధారణంగా 20 వారాల తర్వాత కనిపించే అధిక రక్తపోటు సమస్యను ప్రీ-ఎక్లాంప్సియాగా వ్యవహరిస్తారు. ఇది హైబీపీతో పాటు మూత్రంలో ప్రొటీన్ వెళ్లడం, మూత్రపిండాలు, ఇతర అవయవాలు దెబ్బతినడం వంటి ఇబ్బందులను కలిగిస్తుంది. కొన్నిసార్లు శిశువు పుట్టిన రెండు వారాల తరువాత ఇది కనిపిస్తుంది. నెలలు నిండకుండానే.. అధిక రక్తపోటు వల్ల నెలలు నిండకుండా ప్రసవించే ముప్పు ఉందని వైద్యులు వివరించారు. ఆరు, ఏడు, ఎనిమిది నెలలకే శిశువులు పుట్టే ప్రమాదముందన్నారు. ఇలా పుట్టిన శిశువులకు అవయవాలు వృద్ధి చెందవని, దీని వల్ల వారు చనిపోయే ముప్పు ఉంటుందన్నారు. హైరిస్కు ఉన్న గర్భిణులకు ఈ జబ్బు ఉంటే కొన్ని సందర్భాల్లో గర్భ విచ్ఛిన్నం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. వీళ్లకు ఇబ్బందులు త్వరగా, ఆలస్యంగా వివాహం చేసుకున్న వారు. 18 ఏళ్లలోపు, 40 ఏళ్లు తరువాత గర్భం దాల్చిన మహిళలు. హైబీపీ 140/90 మించి ఉన్న గర్భిణులు. అధిక బరువు, కొలెస్ట్రాల్, మధుమేహం, మూత్రపిండాల జబ్బులు ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఉంటే... అధిక రక్తపోటు.. కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, ముఖం, చేతులు వాపు, మూత్రం రాకపోవడం, నురుగుగా రావడం. అస్పష్టమైన దృష్టి, అకస్మాత్తుగా బరువు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే అప్రమత్తమవ్వాలి. రక్తనాళాలు సన్నగా మారితే.. ‘గర్భిణి సమయంలో ఏర్పడిన మాయ ద్వారా తల్లి నుంచి బిడ్డకు రక్తం సరఫరా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు సన్నగా మారితే సరఫరా సక్రమంగా జరగదు. తద్వారా శిశువుకు రక్తం అందక అవయవాల ఎదుగుదల లోపిస్తుంది. ఈ సమయంలో గర్భిణులకు బీపీ పెరిగి అధిక స్థాయికి చేరుకుంటుంది. దీనిని ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి నిర్ధారించుకోవాలి’ అని వైద్యులు సూచిస్తున్నారు. బీపీని వెంటనే పరిశీలించకపోతే అబార్షన్ కావడం, శిశువు మరణించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటాయని తెలిపారు. భవిష్యత్తులోనూ తల్లులకు గుండె సంబంధిత, మూత్రపిండ వ్యాధులు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. మొదటి ప్రెగ్నెన్సీలో ప్రీ-ఎక్లాంప్సియా వచ్చి ఉంటే రెండోసారి గర్భం దాల్చినపుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జన్యుపరమైన కారణాలు, ధూమపానం, ఒత్తిడి, ఒకేచోట కదలకుండా ఉండడం, వ్యాయామం లేకపోవడం సమస్యలు కూడా ఇందుకు కారణమవుతాయని చెబుతున్నారు. గ్రేటర్లో నెలకు ఏడు వేలకుపైగా.. గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, నర్సింగ్‌హోంలలో కలిపి నెలకు ఏడు నుంచి ఎనిమిది వేల వరకు ప్రీ-ఎక్లాంప్సియా కేసులు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో ఏడాదికి 1,500 నుంచి 2వేల వరకు ఈ తరహా కేసులు ఉంటున్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు 320 మందికిపైగా చికిత్స అందించారు. ప్రత్యేక క్లినిక్‌తో చికిత్సలు అధిక రక్తపోటుతో బాధపడే గర్భిణులకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ప్రీ - ఎక్లాంప్సియా క్లినిక్‌లో చికిత్సలు అందిస్తున్నాం. ప్రతీ శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు ఉంటాయి. ఈ క్లినిక్‌లో గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యురాలజీ, నేత్ర వైద్యులు ఉంటారు. అధిక రక్తపోటు, టైప్ 1, 2 మధుమేహం, ఆటో ఇమ్యున్ రుగ్మతలు, అధిక బరువు వంటి ఇబ్బందులను గుర్తించి అవసరమైన పరీక్షలు చేసి చికిత్సలు అందిస్తాం. 5వ నెలలో హైబీపీ ఉన్న గర్భిణులను ఈ ప్రత్యేక క్లినిక్‌కు పంపిస్తాం. అక్కడ అవసరమైన పరీక్షలను, మందులను సూచిస్తాం. ప్రసవం వరకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. డాక్టర్ వాణి, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి ప్రసవానికి ముందు, తర్వాత పర్యవేక్షణ గర్భిణులకు మొదటి నెల నుంచే అధిక రక్తపోటును పరిశీలిస్తుంటాం. ఎవరికైనా అంతకు ముందు బీపీ ఉంటే మొదటినుంచే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాం. గర్భం దాల్చిన తరువాత 16, 20, 28 వారాల్లో ప్రత్యేక పరీక్షలు తప్పనిసరి. ప్రసవం జరిగిన తర్వాత కొన్ని నెలలపాటు వారికి బీపీ పరీక్షలు చేస్తూనే ఉంటాం. గర్భం సమయంలో సాధ్యమైనంత వరకు బీపీ నియంత్రణలో ఉంచడానికి జాగ్రత్తలు తీసుకుంటాం. అవసరమైన సమయంలో నిపుణుల సలహాలు తీసుకుంటాం. ప్రసవం తర్వాత ఎవరికైనా హైబీపీ ఉంటే ప్రత్యేక క్లినిక్‌కు పంపిస్తాం. అవసరమైన చికిత్సలు అందిస్తాం. డాక్టర్ శోభ, గైనాకాలజీ విభాగం అధిపతి, గాంధీ ఆస్పత్రి ఈ వార్తలు కూడా చదవండి: పూర్తి భద్రత ప్రమాణాలతో సంగం ఉత్పత్తులు సైబర్ ఫిర్యాదులకు ఇకపై ఈ- జీరో ఎఫ్ఐఆర్ Read Latest AP News And Telangana News And International News And Telugu News