
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (Ireland vs India) ఆడేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. అయితే..
ఇప్పుడు అందరి దృష్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరంగేట్రంపైనే ఉంది. ఈ 15 ఏళ్ల చిచ్చరపిడుగును టీమ్ఇండియా జెర్సీలో చూసేందుకు భారత అభిమానులతోపాటు క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో అతడికి మాజీలు పలు సూచనలు కూడా చేస్తున్నారు.
భారత జట్టు తరఫున ఆడే అవకాశం వచ్చినప్పుడు.. దానిని ఆస్వాదించాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. ‘‘అతడు 15 ఏళ్ల కుర్రాడు. తన సొంత ఊరిలోని గల్లీల్లో ఆడుతున్నట్లుగానే.. ఇప్పుడూ ఆస్వాదిస్తూ ఆడాలి. ఎందుకంటే.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతూ సాగించే ప్రయాణం ఇకపై ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. చివరికి అది ఒక బాధ్యతగా.. పనిగా మారుతుంది. దీంతో ఒత్తిడి ప్రభావం కనిపిస్తుంది. కానీ.. ప్రస్తుతానికి అతడు ఆనందంగా ఆడుతూ మనందరినీ అలరించాలని కోరుకుంటున్నాను’’ అని అశ్విన్ ఓ మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు.
‘‘వైభవ్ ప్రత్యేకమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ శైలే కాకుండా.. బౌలర్లకనుగుణంగా అతడి ఆటలో చేసుకున్న చిన్న చిన్న మార్పులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి’’ అని అశ్విన్ ప్రశంసించాడు.
మరోవైపు వైభవ్ అరంగేట్రంపై టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కొటక్ స్పందించాడు. వైభవ్ అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడని.. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ‘‘అతడికి దక్కాల్సిన గుర్తింపు, అవకాశాలు కచ్చితంగా లభిస్తాయి. అయితే.. కేవలం అతడికి అవకాశాలు కల్పించడం కోసం.. ఇప్పటికే పరుగులు సాధిస్తున్న మరోక ఆటగాడిని పక్కనపెట్టడం సరైంది కాదని నా అభిప్రాయం’’ అని కొటక్ పేర్కొన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.