
హైకోర్టు, డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 180 రోజుల శిశు సంరక్షణ సెలవులు, 5 రోజులు అదనపు సాధారణ సెలవులు ఇచ్చేలా ఆదేశాలు..
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): హైకోర్టు, డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 180 రోజుల శిశు సంరక్షణ సెలవులు, 5 రోజులు అదనపు సాధారణ సెలవులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఉద్యోగుల సర్వీసు సంబంధ విషయాల్లో పిల్ దాఖలు చేయడానికి వీల్లేదని, ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని గుర్తు చేసింది. పిల్కు విచారణార్హత లేదంటూ కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులతో సమానంగా హైకోర్టు, డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సెలవులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆర్చ్ బిషప్ చేగుడి అశోక్బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ గురువారం విచారణకు వచ్చింది.