
భారత్ కు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటూనే ఉంటుంది. ఇప్పటికే అనేకసార్లు భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.
అయితే ప్రతిసారీ భారత్ ఆ ఉగ్రమూకలను గట్టిగా బుద్ధి చెబుతూ వస్తూనే ఉంది. కానీ ఆ టెర్రరిస్టు మూకలు మాత్రం భారత్ టార్గెట్ గా ప్రణాళికలు రచిస్తూనే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో 25 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాలతో భారత్- పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇక పాకిస్థాన్ అంటే భారతీయులకు ఎప్పుడూ పడదు. అయితే రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఓ 38 ఏళ్ల మహిళ ఇటీవల పాకిస్థాన్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. నేపాల్ మీదుగా పాకిస్థాన్ లోకి ఎంటర్ అయ్యేందుకు యత్నించి అధికారులకు చిక్కింది. తీరా ఆమెను ఆరా తీయగా.. తాను జైషే మహ్మద్ టెర్రరిస్ట్ సంస్థ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ కు సన్నిహితుడైన ఓ టెర్రరిస్ట్ కమాండర్ ను పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్నట్లు బదులిచ్చింది. దాంతో ఒక్కసారిగా షాకైన పోలీసులు ఆ మహిళను కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో పోలీసులు, అధికారులు కంగు తిన్నారు.
ఆమె పేరు బబితా ధకడ్ అలియాస్ ఖదీజా(38) ఆమె రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన మహిళ. సీతాపుర ప్రాంతంలో తన తల్లిదండ్రులతో ఆమె నివసిస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్ ఘటన జరిగిన తర్వాత పాకిస్థాన్ లోని ఉగ్రవాదులతో సన్నిహితంగా ఉండాలని భావించి సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో పాకిస్థాన్ ప్రొఫైల్స్ ఉన్న వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు, మెసేజ్ లు పెడుతూ వచ్చింది. ఈ క్రమంలో పాకిస్థాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థల్లోని టెర్రరిస్టులతో ఆమె చాటింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తాను సోషల్ మీడియాలో టెర్రరిస్టుల కోసం వెతికానని ఖదీజా విచారణలో వెల్లడించింది. అలా చాలామంది ఉగ్రవాదులతో కాంటాక్ట్స్ పెంచుకున్నట్లు తెలిపింది. ఉగ్రవాద సంస్థల ఫేస్ బుక్ పేజీలను ఫాలో అవుతూ వాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు, మెసేజ్ లు పెడుతూ అలా దగ్గరైనట్లు పేర్కొంది. ఈ క్రమంలో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులతో ఆమె చాట్స్, మెసేజ్ లు, వీడియోలు పంచుకుంది.
ఈ క్రమంలో అబూ ఉబెయిదా అనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుతో ఎమోషనల్ గా కనెక్ట్ అయింది ఖదీజా. అలా ఉగ్రవాద సంస్థ అయిన ముజాయిదీన్ లో చేరాలని కోరుకుంటున్నట్లు అబూ ఉబెయిదాతో తెలిపింది. ఈ సంస్థను మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అయి అందులోని పోస్టులు, వీడియోలను నిత్యం ఫాలో అయింది. ఈ క్రమంలో అబూ ఉబెయిదా తనను పెళ్లి చేసుకుంటానని అన్నాడని విచారణలో ఖదీజా పేర్కొంది. అందులో భాగంగా ఖురాన్ చదవడం నేర్చుకోవాలని, ఇస్లామిక్ టీచింగ్స్ రావాలని, ప్రేయర్స్ చేయడం తెలియాలని తనకు చెప్పినట్లు ఖదీజా తెలిపింది. అంతేకాక పాకిస్థాన్ కు వచ్చి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో సేవ చేయాలని కూడా తనకు పిలుపు వచ్చినట్లు వివరించింది.
అందుకోసం పాస్ పోర్టు కూడా సిద్ధం చేసుకోవాలని తనకు ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఖదీజా పేర్కొంది. పాకిస్థాన్ కు ఎలా రావాలి..? అన్న విషయంపై తనకు అబూ ఉబెయిదా మధ్య సంభాషణలు జరిగినట్లు వివరించింది. ఓ క్లెరిక్ ద్వారా నేపాల్ నుంచి సౌదీ అరేబియా లేదా యూఏఈ నుంచి పాకిస్థాన్ కు వచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు పేర్కొంది. అలాగే తన ప్రయాణ ఖర్చులను క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లించేందుకు ఈ మేరకు క్రిప్టో కరెన్సీ యాప్ లను కూడా డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఖదీజా తెలిపింది. అయితే అబూ ఉబెయిదాతో గంటలు గంటలు చాటింగ్ చేసిన తర్వాత అతనికి అప్పటికే మ్యారేజ్ అయినట్లు తెలుసుకుని తాను చాలా బాధ పడినట్లు పేర్కొంది.
ఇక ప్రస్తుతం ఖదీజా పోలీసుల అదుపులో ఉంది. ఆమెకు జూన్ 27 వరకు పోలీస్ కస్టడీ ఉంది. ఇక విచారణలో ఖదీజాకు 2018లో మ్యారేజ్ అయినట్లు కానీ కొద్ది కాలానికే ఆమె తన భర్త నుంచి విడిగా ఉంటున్నట్లు తేలింది. ఇక ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.