అంత్యోదయ అన్న యోజన పథకంలో కేంద్రం కీలక మార్పులు తీసుకురానుంది. ఈ పథకం కింద లబ్దిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఒక్కొక్కరికీ 7 కిలోల ఆహారధాన్యాలు అందజేసేలా మార్పులు చేయబోతోంది.
ప్రస్తుతం ఉన్న 35 కిలోల గరిష్ఠ పరిమితిని యథాతథంగా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి జాతీయ ఆహార భద్రత చట్టం 2013ను సవరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర ఆహర మంత్రిత్వ శాఖ.. జులై 13 వరకు గడువు విధించింది. ప్రస్తుతం అత్యంత నిరుపేద కుటుంబాలకు అంత్యోదయ అన్న యోజన పథకం కింద సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా 35 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా ఇస్తున్నారు. అదే, సాధారణ రేషన్‌కార్డుదారులకు ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున అందిస్తున్నారు. కానీ, మార్పుల తర్వాత అంత్యోదయ కార్డుదారులు కుటుంబంలో ఇద్దరే ఉంటే వారికి 14 కిలోలు ఆహారధాన్యాలు మాత్రమే లభిస్తాయి. ఐదుగురు లేదా అంతకు మించి ఉన్నా 35 కిలోలు పంపిణీ చేస్తారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికీ తగిన పరిమాణంలో ఆహారధాన్యాలను అందజేయడమే ఈ సవరణ ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రస్తుత విధానం వల్ల ఎక్కువ మంది అంత్యోదయ అన్న యోజన కుటుంబాలు, సాధారణ రేషన్‌కార్డు కేటగిరీ కంటే తలసరి తక్కువ రేషన్‌ను పొందుతున్నాయి. వాస్తవానికి ప్రయారిటీ హౌస్‌హోల్డ్ కేటగిరీ అనేది అంత్యోదయ లబ్ధిదారుల కంటే తక్కువ నిరుపేదలుగా ఉన్నవారి కోసం ఉద్దేశించబడింది.‘‘అంత్యోదయ అన్న యోజన కింద ప్రస్తుతం ఉన్న 'కుటుంబ ఆధారిత రేషన్ విధానం' అత్యంత నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెచ్చినప్పటికీ, ఇది కుటుంబ పరిమాణాన్ని బట్టి లబ్ధిదారుల మధ్య తీవ్ర అసమానతలకు దారితీస్తోంది’’ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న కుటుంబాలకు వచ్చే రేషన్ పరిమాణంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కానీ పెద్ద కుటుంబాల సభ్యుల సంఖ్యకు అనుగుణంగా రేషన్ కేటాయింపులు పెరుగుతాయి కాబట్టి వారు దీని వల్ల లబ్ధి పొందుతారు.జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 లక్ష్యాలకు అనుగుణంగా సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని తగినంత పరిమాణంలో అందించడం ద్వారా ఆహార, పోషకాహార భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న విస్తృత విధానంలో భాగంగానే ఈ సవరణను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం, ప్రయారిటీ హౌస్‌హోల్డ్స్, అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులిద్దరికీ బియ్యం లేదా గోధుమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.