RBI MPC: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ అక్కడి పరిస్థితులు, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.
వడ్డీ రేట్ల పెంపుపై అడిగిన ప్రశ్నకు సూత్రప్రాయంగా సమాధానం ఇచ్చారు. వడ్డీ రేట్లను పెంచే అంశంపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని తెలిపారు. వచ్చే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలోనూ వడ్డీ రేట్లను పెంచబోమని సూత్రప్రాయంగా తెలిపారు. అందుకు గల కారణాలు, సన్నద్ధతపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఒక వేళ మార్కెట్‌ను వడ్డీ రేట్ల పెంపునకు సిద్ధం చేయాలనుకుంటే మా విధాన వైఖరిని ఇప్పటికే మార్చుకునే వాళ్లము. వచ్చే నెలలో జరిగే ఎంపీసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచడం ఖాయమైతే మేము మా వైఖరిని తటస్థం నుంచి నియంత్రణ స్థాయికి మార్చేవాళ్లం కదా? కానీ, మేము ఇప్పటికీ అలా చేయాలేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ముప్పు పొంచి ఉందని మాకు తెలుసు. ప్రధానంగా ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగానే ఉన్నాం. ఎందుకుంటే అది గరిష్ఠ పరిమితిని చేరింది. భవిష్యత్తులోనూ ఈ గణాంకాల ఆధారంగానే వడ్డీ రేట్లపై నిర్ణయాలు ఉంటాయి' అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జూన్, 2026లో జరిగిన ఎంపీసీ కమిటీ సమీక్షా సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేట్లను మార్చకుండా యథాతథంగానే కొనసాగించింది. రెపో రేటు ప్రస్తుతం 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా ఉద్రిక్తతల తీవ్రత తగ్గుతుండడం ప్రపంచంతో పాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సైతం శుభపరిణామమని ఆయన అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ద్రవ్యోల్బణానికి ఇది సానుకూల అంశంగా చెప్పారు. క్రూడ్ ఆయిల్ ధరలు అదుపులోకి రావడంతో పాటుగా యూరియా ధరలు సైతం తగ్గడం వంటివి భారత ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించే అంశంగా ఆయన చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత్ తీవ్రంగా ప్రభావితమైంది. హార్ముజ్ జల సంధిని మూసివేయడంతో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో దేశంలో ధరలు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణం గరిష్ట పరిమితులకు చేరింది. దీంతో వడ్డీ రేట్లను గత త్రైమాసికంలోనే పెంచుతారని అంతా భావించారు. అయితే, ఆర్బీఐ మాత్రం యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత మూడు త్రైమాసికాలుగా వడ్డీ రేట్లను మార్చకుండా వస్తోంది. అయితే, ఈసారి కచ్చితంగా పెంపు ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కానీ, ఆ వ్యాఖ్యలను గవర్నర్ మల్హోత్రా కొట్టిపారేశారు.