తెలంగాణలో సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది
ఎమ్మెల్యేలకు క్లీన్‌చీట్ ఇస్తూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. వచ్చే నెలకు వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. పార్టీ మారలేదని స్పీకర్ గతంలోనే తీర్పును వెలువరించగా.. ఆ నిర్ణయాన్ని పలువురు ఎమ్మెల్యేలు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. తాము సరైన ఆధారాలు సమర్పించినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విఫలం అయ్యారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు వేయగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రిపోర్టులను సమర్పించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రతివాదులైన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై పోటీ చేసి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత వారు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినట్లు బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ విషయంలో గతంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు న్యాయపోరాటానికి దారితీసింది.