
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
AP Drug Rehabilitation Centers: రాష్ట్రంలోని 16 వ్యసన విముక్తి కేంద్రాలను (డి-అడిక్షన్) రూ.9.86 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ కేంద్రాల్లో అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు, బయో-ఫీడ్ బ్యాక్ మెషిన్, ఈసీజీ మెషిన్ వంటి ఇతర సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో మూడింటిని పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలతో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ'లుగా తీర్చి దిద్దుతామని చెప్పారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం (శుక్రవారం, 26న) సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి సత్యకుమార్ ప్రకటన జారీచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 25 వ్యసన విముక్తి కేంద్రాలు నడుస్తున్నాయి. మద్యం, గంజాయి, నల్ల మందు, మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడం, పీల్చడం, ఇతర వ్యసనాలకు అలవాటుపడిన వారు వాటికి దూరంగా ఉండేందుకు ముందుకువస్తే ఈ కేంద్రాల్లోని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అర్హత కలిగిన వారు వ్యసనపరులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ కేంద్రాల్లోని అవసరాలకు 346 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా 2024 నాటికి 200కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన అనంతరం పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది.
ఇప్పటివరకు 57 పోస్టుల్ని భర్తీచేయగా ఇందులో వైద్యులు, కౌన్సెలర్లు, నర్సులు, వార్డు బాయ్ లు, యోగా థెరపిస్ట్, ఇతర పోస్టులు ఉన్నాయి. మరో 123 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీ జరిగి, భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ నియామకాలు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇవి కాకుండా మరో 52 పోస్టుల భర్తీకి సంబంధిన ఫైళ్లు సదరు జిల్లాల కలెక్టర్ల పరిశీలనలో ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు జారీ చేయాలని సదరు జిల్లాల కలెక్టర్లకు తెలియచేశామని మంత్రి తెలిపారు. ప్రతి కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ తో కలిపి 14 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
రూ.9.89 కోట్లతో నిర్మాణాలు, పరికరాలు, ఇతర సౌకర్యాల కల్పన
కర్నూలు, తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం, నంద్యాల, తూర్పు గోదావరి, ప్రకాశం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, పల్నాడు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, విశాఖ, ఎన్టీఆర్, కడపలోని వ్యసన విముక్తి కేంద్రాలను వ్యసనపరులకు అన్ని రకాల చికిత్స, కౌన్సెలింగ్ ఇచ్చేందుకు వీలుగా రూ.9.86 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు. ఇందులో రూ.8 కోట్లను నిర్మాణాలు, ఫర్నిచర్, ఇతర అవసరాలకు వినియోగిస్తామని తెలిపారు. మిగిలిన నిధులతో బయో ఫీడ్ బ్యాక్ మెషిన్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. బయోఫీడ్ బ్యాక్ మెషిన్ ఖరీదు రూ.2.50 లక్షలు. దీనిని వ్యసనపరుల్లో ఉండే మానసిక ఒత్తిడి, కుంగుబాటు తగ్గించేందుకు వినియోగిస్తారని తెలిపారు. ఈ నిధులు ఎక్సైజ్ శాఖలో ఉన్న 'సెస్' ఫండ్ నుంచి వస్తాయని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, కడపలోని కేంద్రాలను 'సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ'లుగా గుర్తించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. ఈ కేంద్రాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తిస్తే అక్కడ మరిన్ని సదుపాయాలు సమకూరతాయన్నారు. ఇతర కేంద్రాల నుంచి ఉన్నత చికిత్స నిమిత్తం బాధితులను విజయవాడ, విశాఖ కడప కేంద్రాలకు పంపుతారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన అనంతరం గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం పెట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఓపీ ద్వారా 44,860 మంది ఉచితంగా సేవలు పొందారని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. అలాగే 3,255 మంది ఇన్ పేషెంట్లుగా చేరారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మే వరకు ఓపీ ద్వారా 12,161, ఐపీ ద్వారా 1,018 మంది సేవలు పొందారని తెలిపారు. వీరిలో గంజాయి అలవాటు నుంచి బయటపడేందుకు చికిత్స కోసం వచ్చిన వారు 253 మంది ఉన్నారని తెలిపారు. 2025-26లో ఓపీ ద్వారా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 5,222 మంది చికిత్స పొందారు. తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం, పాడేరు, రాజమహేంద్రవరం, కాకినాడ ఆసుపత్రుల్లోని కేంద్రాల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 4వేల నుంచి 3వేల మధ్య చికిత్స పొందారు.