
మాంసాహార ప్రియులు మటన్ తలకాయ కూరను ఎంతో ఇష్టంగా తింటారు. వాస్తవానికి మేక తలకాయ కూర పోషకాలతో నిండిన అద్భుతమైన ఆహారం..
ఇందులో ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్, ఫాస్పరస్, అలాగే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.. అలాగే.. మెదడు పనితీరును మెరుగుపరచడం, రక్తహీనతను నివారించడంలో అలాగే ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.. మేక తలకాయలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఈ విధంగా, మేక తలకాయ కూర మొత్తం ఆరోగ్యానికి దోహదపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇన్ని పోషకాలు కలిగిన మేక తలకాయ కూరను అత్యంత సులభమైన పద్ధతిలో ఎలా తయారుచేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఈ రెసిపీని అనుసరిస్తే వంట అనుభవం లేని వారు కూడా అద్భుతమైన, నోరూరించే తలకాయ కూరను పర్ఫెక్ట్గా వండగలరు. ఈ కర్రీ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది.
ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత రెండు లేదా మూడు లవంగాలు, రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు, రెండు లేదా మూడు స్టార్ పువ్వు ముక్కలు, కొంచెం జాపత్రి, ఒక బిర్యానీ ఆకును మధ్యలోకి తుంచి వేయాలి. ఈ హోల్ గరం మసాలా దినుసులను రెండు నిమిషాల పాటు మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. వేయించిన మసాలా దినుసుల్లో ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి, రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని బాగా కలిపి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో రెండు నిమిషాల పాటు మగ్గించాలి.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉల్లిపాయలను బాగా మగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు చక్కగా మగ్గి, కూర రుచి పెరుగుతుంది.
బాగా మగ్గిన ఉల్లిపాయల్లో, శుభ్రం చేసుకున్న ఒక కిలో మేక తలకాయ మాంసాన్ని చేర్చుకోవాలి. మాంసాన్ని వేసిన తర్వాత ఉల్లిపాయలతో కలిపి బాగా మిక్స్ చేయాలి. దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఐదు నిమిషాల పాటు మగ్గించాలి.
మాంసం ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత, మూత తీసి రుచికి సరిపడా కళ్ళు ఉప్పు (రెండు టీ స్పూన్లు), అర టీ స్పూన్ పసుపు, మరొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. కళ్ళు ఉప్పు వాడటం వల్ల కూరకు మంచి రుచి వస్తుంది.
మీరు తీసుకున్న తలకాయ మాంసం లేతది అయితే ఈ పద్ధతిలో గిన్నెలో వండవచ్చు. ఒకవేళ మాంసం ముదురుది అయితే, ముందుగా కుక్కర్లో మాంసాన్ని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గ్లాస్ నీళ్లు వేసి నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత పైన చూపిన విధంగా మొదటి దశ నుండి కొనసాగించాలి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత, మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. మాంసం 80% ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడే కూరకు మంచి రుచి వస్తుంది.
మాంసం 80% ఉడికిన తర్వాత, తగినంత కారం (నాలుగు టీ స్పూన్లు) వేసి బాగా మిక్స్ చేయాలి. తలకాయ మాంసంలో కారం కొంచెం ఎక్కుగానే ఉంటే రుచి బాగుంటుంది. కారం వేసిన తర్వాత, అర లీటరు నీళ్లు పోసి బాగా కలిపి, అర టీ స్పూన్ దంచిన మిరియాలు, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. మిరియాల పొడి కూరకు అదనపు రుచిని ఇస్తుంది.
మిరియాల పొడి, గరం మసాలా వేసిన తర్వాత బాగా కలిపి, మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఈ కూర గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుంది. గ్రేవీ లైట్‌గా ఉన్నప్పుడు, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.. ఈ విధంగా తయారు చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకోండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..