
సాధారణంగా టూర్ అనగానే చాలామందికి ఊటీ, మనాలి గుర్తుకొస్తుంటాయి. కానీ భారత్ లో దాగిన అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఇప్పుడిప్పుడే పర్యాటకులకు చేరువవుతున్నాయి.
ఇటీవలికాలంలో సోషల్ మీడియా పెరిగిన తరుణంలో ఈ ప్రాంతాలకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. ఇన్నాళ్లూ సీక్రెట్ ప్రాంతాలుగా ఉన్న ఈ లోయలు ఇప్పుడు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఓవైపు ఆధ్యాత్మికత, మరోవైపు అడ్వెంచర్ ట్రెక్కింగ్, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు నెలవుగా ఉంది. దేశంలోని అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి.ఉత్తరాఖండ్ లో ఏటా జరిగే ప్రసిద్ధమైన చార్ ధామ్ యాత్రకు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇక యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఇలా నాలుగు క్షేత్రాలను కలిపి చార్ ధామ్ అని పిలుస్తారు. అలాగే ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధమైన హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అవి ముస్సోరీ, నైనిటాల్, ఔలి.. ఇక ఉత్తరాఖండ్ లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్ తదితర వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.అలాగే ఉత్తరాఖండ్ ప్రాంతం అనేక ప్రకృతి రమణీయమైన వ్యాలీలకు ప్రసిద్ధి చెందింది. ఇవి ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను, ట్రెక్కర్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వాటిలో ఒకటి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్.. ఉత్తరాఖండ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యాలీల్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఒకటి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ లోయ చాలా అద్భుతంగా రంగుల తివాచీ పరిచినట్లుగా ఉంటుంది. అలాగే ఉత్తరాఖండ్‌ లోని నార్త్ పితోర్‌ గఢ్ జిల్లాలో ఉన్న జోహార్ వ్యాలీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నందా దేవి, త్రిశూల్, పంచచూలి వంటి ఎత్తైన హిమాలయ శిఖరాల మధ్య ఈ వ్యాలీ ఎంతో అందంగా ఉంటుంది.ఈ లోయకు వెళ్లాలంటే మంచు కరిగే సమయం మే నుంచి అక్టోబర్ వరకు మాత్రమే వీలుంటుంది. మే, జూన్ నెలల్లో హిమాలయాల్లో పూసే పూలు, పచ్చని మైదానాలతో ఈ వ్యాలీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఓవైపు దేశవ్యాప్తంగా ఎండలు ఉన్నా.. ఇక్కడ మాత్రం పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటదు అదే ఈ ప్రాంత విశేషం. కాలుష్యం లేని గాలి, ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారికి ఇది మంచి పర్యాటక ప్రాంతం అని చెప్పొచ్చు.వీటితోపాటు డెహ్రాడూన్ లోని డ్యూన్ వ్యాలీ కూడా చాలా ఫేమస్.. ఈ వ్యాలీ శివాలిక్ హిల్స్, హిమాలయ పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రాంతం సొంతం. అలాగే మనా వ్యాలీ, జోహార్ వ్యాలీ, హర్ కీ దూన్ వ్యాలీ, భిల్గంగ వ్యాలీ, ధర్మా వ్యాలీ కూడా చాలా ఫేమస్. మీరూ ఓసారి ఉత్తరాఖండ్ లోని ఈ వ్యాలీల్లో పర్యటించండి.