EPF Claims Processing Shutdown : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్- EPFO) కీలక ప్రకటన చేసింది.
సర్వర్ అప్‌గ్రేడ్, సిస్టమ్ మైగ్రేషన్ కారణంగా ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు జూన్ 26 నుంచి 28 వరకు 3 రోజులు తాత్కాలికంగా నిలిపి వేయనున్నట్లు తెలిపింది. తర్వాత జూన్ 29న తిరిగి యథావిధిగా ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో క్లెయిమ్ రిక్వెస్ట్, క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటివి జరగవు అని స్పష్టం చేసింది. ఇది ముందస్తుగానే ప్లాన్ చేసిన అప్‌గ్రేడేషన్ అని పేర్కొంది. ఇది కేవలం ఈపీఎఫ్ఓ సేవలకు మాత్రమే పరిమితం కాలేదు ఉమంగ్ యాప్ సర్వీసులపైనా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఇంకా ఎక్కువ రోజులు 2026, జులై 2 వరకు ఉండనుంది. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ నోటీస్ ప్రకారం 'పోర్టల్ ద్వారా ఈపీఎఫ్ సబ్మిషన్, ప్రాసెసింగ్ సేవలు జూన్ 26 ఉదయం 12 గంటల నుంచి జూన్ 28 రాత్రి 11.59 గంటల వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.' అని పేర్కొంది. అంటే ఇక్కడ 3 రోజుల్లో పీఎఫ్ విత్‌డ్రా, ట్రాన్స్ఫర్ వంటి కొత్త ఆన్లైన్ క్లెయిమ్స్ దరఖాస్తుల్ని సమర్పించేందుకు వీలుపడదు. ఇంకా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ ప్రాసెసింగ్ కూడా 3 రోజుల పాటు తాత్కాలికంగా ఆగిపోతుంది. వీటిని సిస్టమ్ అప్‌గ్రేడేషన్ తర్వాత పరిశీలిస్తారన్నమాట. పీఎఫ్ చందాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు, ఇంకా క్లెయిమ్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవం అందించేందుకు ఈపీఎఫ్ఓ ఈ పోర్టల్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపింది. కొంత కాలంగా ఈపీఎఫ్ సేవల్ని కేంద్రం సులభతరం చేస్తున్న సంగతి తెలిసిందే. విత్‌డ్రాకు సంబంధించిన నిబంధనల్ని సడలిస్తూ వస్తోంది. గతంలో కంటే ఎక్కువ జాప్యం చేయకుండా క్లెయిమ్ చేసుకున్న వారికి డబ్బుల్ని అందిస్తుంది. కొద్ది రోజుల కిందట సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన 8.25 శాతం ఈపీఎఫ్ వడ్డీ రేటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరలోనే ఈ వడ్డీ డబ్బులు పీఎఫ్ చందాదారుల పీఎఫ్ ఖాతాల్లోకి జమవుతాయని స్పష్టం చేసింది. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా వడ్డీ పడిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్, మిస్డ్ కాల్ సర్వీస్, ఉమంగ్ యాప్, ఎస్ఎంఎస్ సేవల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.