
Vaping : ప్రస్తుత యువత, విద్యార్థులలో ‘వేపింగ్’ (Vaping) ఒక పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. సాధారణ సిగరెట్ల కంటే ఇది సురక్షితమైనదని, కేవలం స్టైల్ కోసం వాడుతున్నామని చాలా మంది పొరబడుతున్నారు.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), వైద్య నిపుణుల ప్రకారం వేపింగ్ అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రానిక్ సిగరెట్లు (E-cigarettes), వేప్ పెన్నులు, పాడ్స్ వంటి పరికరాలను ఉపయోగించడాన్ని వేపింగ్ అంటారు. ఇందులో సాధారణ సిగరెట్లలా పొగాకును నేరుగా కాల్చడం జరగదు. బదులుగా, నికోటిన్, కృత్రిమ ఫ్లేవర్లు, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన రసాయనాలతో కూడిన ఒక ద్రవాన్ని వేడి చేసి, దాని ద్వారా వచ్చే ఆవిరిని ఊపిరితిత్తుల్లోకి పీలుస్తారు.
నిజానికి వేప్ ద్రవాలలో ‘నికోటిన్’ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మెదడు ఎదుగుదలను దెబ్బతీసి, యువతను అతి తక్కువ కాలంలోనే దీనికి బానిసలుగా మారుస్తుంది. వేపింగ్ వల్ల రక్తపోటు వేగంగా పెరుగుతుంది. ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. నికోటిన్ వ్యసనం వల్ల యువతలో ఏకాగ్రత లోపించడం, చిరాకు, ఆందోళన, తీవ్రమైన ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. వేపింగ్ పూర్తిగా సురక్షితమనే అభిప్రాయానికి ఆధారాలు లేవని, పైగా ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ పెంచే అవకాశం ఉందని పరిశోధకులు కూడా హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డేవిస్ పరిశోధకులు నిర్వహించిన ఈ సమీక్షను కరెంట్ ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. ప్రయోగశాల అధ్యయనాలు, క్లినికల్ పరిశోధనలు, జనాభాపై నిర్వహించిన అనేక అధ్యయనాలను విశ్లేషించిన పరిశోధకులు వేపింగ్ వల్ల శరీరంలో జరిగే జీవసంబంధ మార్పులను పరిశీలించారు. వారి విశ్లేషణలో వేప్ ఏరోసాల్స్లో ఫార్మాల్డిహైడ్, అసిటాల్డిహైడ్, అక్రోలిన్, హెవీ మెటల్స్, అతి సూక్ష్మ కణాలు వంటి హానికర రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి కణాలను దెబ్బతీయడం, డీఎన్ఏలో మార్పులు తీసుకురావడం, దీర్ఘకాలిక వాపును కలిగించడం వంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మరో ఆందోళనకర అంశం నోటి ఆరోగ్యానికి సంబంధించినది. వేపింగ్ ఉపయోగించే వారిలో నోటి లోపలి కణజాలంలో కణాల ఒత్తిడి, వాపు, డీఎన్ఏ దెబ్బతినడం వంటి ప్రారంభ మార్పులు కనిపిస్తున్నట్లు సమీక్షలో ప్రస్తావించారు. ఇవి క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలుగా భావించే మార్పులతో పోలి ఉన్నాయని పేర్కొన్నారు. రుచులు కలిపిన ఫ్లేవర్డ్ వేపింగ్ ఉత్పత్తులు నోటి కణజాలానికి మరింత చికాకు కలిగించే అవకాశం ఉందని, అయితే దీని దీర్ఘకాలిక ప్రభావాలపై ఇంకా మరిన్ని పరిశోధనలు అవసరమని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఈ సిగరెట్లు పూర్తిగా ప్రమాదరహితమైనవి కావని పలుమార్లు హెచ్చరించింది. ముఖ్యంగా యువత, యుక్తవయస్కుల్లో వీటి వినియోగం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. నోటి క్యాన్సర్ విషయంలో పొగాకు, మద్యం ప్రధాన ప్రమాద కారకాలేనని, అయితే వేపింగ్ కూడా ప్రమాదాన్ని పెంచుతుందా అనే అంశంపై ఆధారాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. చిన్న వయసులోనే వేపింగ్ ప్రారంభించినవారు దశాబ్దాల పాటు దీనిని కొనసాగించే అవకాశం ఉండటంతో భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేపింగ్ సంస్కృతి వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమవ్వకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం 2019లోనే ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, రవాణా, విక్రయంతో పాటు ప్రకటనలపై కూడా పూర్తి నిషేధం విధించింది. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో వీటిని కలిగి ఉండటం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరం. దీనికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అందుకే స్టైల్ కోసం సరదాగా ప్రారంభించే ఈ అలవాటు ప్రాణాల మీదికి తెస్తుందని యువత గ్రహించాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, వారికి దీని దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలి. ఆరోగ్యకరమైన సమాజం కోసం వేపింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండటం ఎంతో అవసరం.